నేతాజీ స్ఫూర్తితోనే భారత్ ముందుకు వెళుతోంది

నేతాజీ స్ఫూర్తితోనే భారత్ ముందుకు వెళుతోంది
 ‘‘నేతాజీ స్ఫూర్తితోనే ఈ రోజు భారత్ ముందుకు వెళుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నేతాజీ 125 వ జయంత్యుత్సవాలను పురస్కరించుకొని కోల్‌కతా మెమోరియల్ హాల్‌లో జరిగిన సమావేశంలో పాల్గొంటూ ఆయన చేసిన కృషి తరతరాల వారూ గుర్తుంచుకోవాలని కోరారు. “అదే మన కర్తవ్యం. ఈ సందర్భంగా నేతాజీకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా” అని చెప్పారు.
 
 ప్రతి సంవత్సరం జనవరి 23 వ తేదీని ‘పరాక్రమ్ దివస్’ గా జరుపుకోవాలని నిర్ణయించామని ప్రధాని వెల్లడించారు. “ఆత్మనిర్భర భారత్ పేరుతో మనం ముందుకెళ్తున్నాం. నేతాజీ జీవించిన జీవన శైలి, నిర్ణయాలు, కార్య పద్ధతి… ఇలా ప్రతి ఒక్కటీ మనకు ప్రేరణనిచ్చేవే. స్ఫూర్తిదాయకాలే.’’ అని ప్రధాని మోదీ తెలిపారు.  
 
నేతాజీ లాంటి మొండి వ్యక్తికి, దృఢమైన మనస్సు ఉన్న వారికి ఏదీ అసాధ్యం కాదని, విదేశాలకు వెళ్లి మరీ, విదేశాలలో నివసిస్తున్న భారతీయులకు నేతాజీ ప్రేరణనిచ్చారని గుర్తు చేసుకున్నారు. కులం, మతం, ప్రాంతం… ఇలా ఏదీ చూడకుండా ప్రతి వ్యక్తినీ సైనికుడిగా తయారు చేశారని, భారత్‌ దాస్య శృంఖలాలను తెంచాలన్న ఒకే ఒక సంకల్పంతో నేతాజీ ముందడుగు వేశారని కొనియాడారు.  
 
నేతాజీ సుభాశ్ చంద్రబోస్ స్వాతంత్ర్య సంగ్రామానికి కొత్త దిశనిచ్చారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరినీ నేతాజీ ఉత్తేజపరిచారని చెబుతూ  ఆయన దేశం కోసం చేసిన సేవ, త్యాగాన్ని గుర్తుంచుకోవడం ప్రతి భారతీయుడి కర్తవ్యమని మోదీ ఉద్బోధించారు. నేటి భారతాన్ని చూస్తే నేతాజీ చాలా గర్వపడే వారని, ఎల్‌ఏసీ నుంచి ఎల్ఓసీ వరకూ భారత పరాక్రమాన్ని, భారత విశ్వరూపాన్ని ప్రపంచం మొత్తం చూస్తోందని మోదీ పేర్కొన్నారు.
 
 ప్రపంచం మొత్తం మహిళల ప్రాథమిక హక్కుల కోసం పరితపిస్తున్న వేళ.. నేతాజీ ఏకంగా రాణిఝాన్సీ పేరుతో ఓ దళాన్ని ఏర్పాటు చేసి స్వాతంత్ర్య పోరాటాన్ని అనుసంధానించారని, వారందరికీ తగు శిక్షణ ఇచ్చి దేశ సంగ్రామంలో పాల్గొనేలా చేశారని ప్రధాని మోదీ గుర్తు చేశారు.  అన్ని రంగాల్లో కూడా బెంగాల్ భూమి అసంఖ్యాకమైన వ్యక్తులను, సంపదలను ఇచ్చిందని, జాతీయ గీతం కూడా ఇక్కడి నుంచే వచ్చిందని మోదీ పేర్కొన్నారు.
 నేతాజీ సుభాశ్ చంద్రబోస్‌కు సంబంధించిన డాక్యుమెంట్ పత్రాలను తమ ప్రభుత్వం బహిరంగపరిచామని, 2018 లో అండమాన్ ద్వీపానికి ‘‘నేతాజీ సుభాస్ చంద్రబోస్ ద్వీపం’’ అని పేరు పెట్టామని ఆయన గుర్తు చేశారు. ‘‘రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అతను ప్రతి దేశానికి వెళ్లి సహాయం కోరారు. ఎందుకు వెళ్లారు? మన దేశ స్వేచ్ఛ కోసం. స్వేచ్ఛాయుత భారతం కోసం. ప్రతి భారతీయుడు నేతాజీకి రుణపడి ఉంటారు.’’ అని ప్రధాని మోదీ తెలిపారు.
నేషనల్ లైబ్రరీలో అంతర్జాతీయ డిలిగేట్లు, కళాకారులను ప్రధాని కలుసుకున్నారు. విక్టోరియా మెమోరియల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ జగదీప్‌ ధన్‌కర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన వెంట ఉన్నారు.