హల్వా వేడుకతో కేంద్ర బడ్జెట్ లో కీలక పక్రియ 

కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ ప్రక్రియకు కీలకమైన హల్వా వేడుకతో ఆర్థికమంత్రిత్వ శాఖ శ్రీకారం చుట్టింది. కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి ముందు సంప్రదాయంగా జరిగే హల్వా వేడుకను  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నార్త్‌ బ్లాక్‌లో నిర్వహించిన హల్వా వేడుకకు  నిర్మలా సీతారామన్‌తోపాటు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆ శాఖ కార్యదర్శులు, ఇతర అధికారులు హాజరయ్యారు.  
 
 చరిత్రలో తొలిసారి బడ్జెట్‌ ప్రతులను పేపర్‌లెస్‌గా అందిస్తున్న క్రమంలో యూనియన్ బడ్జెట్ సమాచారాన్ని సులభంగా శీఘ్రంగా అందించేందుకు వీలుగా “యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌” ను  ఆర్థికమంత్రి ప్రారంభించారు. డౌన్‌లోడ్, ప్రింటింగ్, సెర్చ్, జూమ్ ఇన్ అండ్ అవుట్, బైడైరెక్షనల్ స్క్రోలింగ్, విషయాల పట్టిక, ఇతర లింక్స్‌ యాక్సెస్‌ మొదలైన వాటితో కూడిన యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో దీన్ని రూపొందించారు.  ఇది ఇంగ్లీష్ , హిందీ భాషల్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది.
 
కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన పత్రాల ముద్రణ ప్రారంభానికి గుర్తుగా ఆర్థిక మంత్రిత్వ శాఖలో ‘హల్వా వేడుక’  నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న​ సంగతి తెలిసిందే.  సాధారణంగా హల్వా వేడుక అనంతరం  బడ్జెట్‌ ప్రతుల ప్రింటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. హల్వా వేడుక తరువాత, బడ్జెట్ తయారీ ప్రక్రియలో భాగమైన ఉద్యోగులను నార్త్ బ్లాక్ నేలమాళిగలో సుమారు 10 రోజులు లాక్ చేస్తారు. 
 
అయితే  కరోనా మహమ్మారి నేపథ్యంలో 2021-22 యూనియన్‌ బడ్జెట్‌ ప్రతులను ఈ సారి ముద్రించడం లేదు.  ఫిబ్రవరి 1న  పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్‌ ప్రతులను డిజిటల్‌ ఫార్మాట్‌లోనే సభ్యులకు అందించనున్నారు. అలాగే జనవరి 29న పార్లమెంట్‌కు సమర్పించే ఆర్థిక సర్వే ప్రతులను కూడా ప్రింట్‌ చేయడం లేదు. 
 
 కాగా ఇటీవల  లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా  ప్రకటించిన సమాచారం ప్రకారనం పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు రెండు దశల్లో జరుగనున్నాయి. జనవరి 29 నుంచి ఫ్రిబవరి 15 వరకు తొలి దశ, మార్చి 8 నుంచి ఏప్రిల్‌ 8 వరకు రెండో దశ సమావేశాలుంటాయి..పార్లమెంట్‌ సమావేశాలకు ముందుగా సభ్యులంతా ఆర్టీ-పీసీఆర్‌ కరోనా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని  స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.