ఓటముల భయంతో అధ్యక్ష పదవికై రాహుల్ వెనకడుగు

పార్టీ అధ్యక్ష పదవి చేబడితే త్వరలో ఐదు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమి చెందితే బాధ్యత వహించవలసి వస్తుందనే భయంతో మరోసారి పార్టీ నాయకత్వంపై రాహుల్ గాంధీ వెనుకడుగు వేశారు. దానితో కాంగ్రెస్‌ పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక జూన్‌ వరకు వాయిదా పడింది. ఈ మేరకు శుక్రవారం సోనియా అధ్యక్షతన ఆన్‌లైన్‌ ద్వారా జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సిడబ్ల్యుసి) నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడి ఎన్నికలో ఆలస్యంపై పార్టీ సీనియర్‌ నేతలు, ప్రధాన కార్యదర్శులు కెసి.వేణుగోపాల్‌, రణదీప్‌ సుర్జేవాలా స్పందించారు. 

 అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ మే నెలను సూచించినా, అసోం, బెంగాల్‌, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రక్రియను సిడబ్ల్యుసి జూన్‌ వరకు వాయిదా వేసిందని వారు తెలిపారు.

 అధ్యక్ష ఎన్నిక తర్వాత లేదా, కొత్త అధ్యక్షులు బాధ్యతలు చేపట్టిన తర్వాత సిడబ్ల్యుసి సభ్యుల ఎన్నిక ఉంటుందని వేణుగోపాల్‌ వెల్లడించారు.   ఇప్పటికిప్పుడు రాహుల్ గాంధీ పార్టీ అద్యక్షుడైతే, త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను స్వీకరించవలసి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

 పశ్చిమ బెంగాల్, అస్సాం, తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగులేనందువల్ల మరో పరాజయ భారాన్ని ఆయన మోయవలసి వస్తుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అందుకే ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారని చెబుతున్నారు. 

వర్కింగ్‌ కమిటీ సమావేశంలో అధ్యక్ష ఎన్నిక విషయమై వాగ్యుద్ధం కూడా చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. సంస్థాగత ఎన్నికలను వెంటనే జరపాలని గులాంనబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ మొదలైనవారితో కూడిన అసమ్మతి బృందం పట్టుబట్టింది. కానీ గాంధీల విధేయ నేతలు మాత్రం ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిపాక దీన్ని చేపట్టవచ్చని వాదించారు. 

కార్యకర్తలు, దిగువ స్థాయి నేతలకు దిశానిర్దేశం కోసం వెంటనే ఎన్నికలు జరపడం మంచిదన్న వాదనను చిదంబరం, ముకుల్‌ వాస్నిక్‌, ఆజాద్‌ గట్టిగా సమర్థించారు. ‘అంతర్గత ఎన్నికలు కాదు, నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించే విషయమై దృష్టిపెట్టాలి’ అని గాంధీల విధేయుడు, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ స్పష్టం చేశారు. 

‘‘అంతర్గత ఎన్నికల గురించి మన పార్టీలో జరుగుతున్నట్లు బీజేపీలో ఎన్నడైనా చర్చ జరిగిందా?’ అని మరో నేత ప్రశ్నించినట్లు తెలిసింది. అతడితో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, ఏకే ఆంటోనీ, ఊమెన్‌ చాందీ, తారిక్‌ అన్వర్‌ మొదలైన విధేయవర్గం సమర్థించింది. వాదన ఎంతకీ తెగకపోవడంతో రాహుల్‌ గాంధీ కల్పించుకుని అసెంబ్లీ ఎన్నికల తర్వాతే అధ్యక్ష ఎన్నిక అని తేల్చి చెప్పారు. ఈ ఏడాది జూన్‌ నాటికి ఇది తేలిపోతుందని రాహులే స్వయంగా అన్నట్లు తెలిసింది

కాంగ్రెస్‌ను సంస్థాగతంగా ప్రక్షాళన చేయాలని, చురుకైన నేతకు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించాలని సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 2019 ఆగస్టులో రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన తర్వాత సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. 

గత ఏడాది ఆగస్టులో 23 మంది కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీకి రాసిన లేఖలో పార్టీని ప్రక్షాళన చేయాలని కోరారు. వీరిలో గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, భూపీందర్ హుడా, పృథ్వీరాజ్ చవాన్, కపిల్ సిబాల్ వంటివారు ఉన్నారు. ఈ లేఖ రాసినవారిలో కొందరితో సోనియా గాంధీ గత నెలలో మాట్లాడారు. త్వరలోనే ఎన్నికల షెడ్యూలును విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

అయితే రాహుల్ ను కాకుండా మరెవ్వరికీ పార్టీ అధ్యక్ష పదవి అప్పచెప్పడానికి సోనియా కుటుంభం సిద్ధంగా  లేకపోవడం, అధ్యక్ష పదవి చేపట్టడానికి రాహుల్ ఆడుతూ ఉండడంతో పార్టీలో సంస్థాగత ప్రక్షాళన జరగడం లేదు. 

దానితో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలను, ఏఐసీసీ సెషన్‌ను మే 29న నిర్వహించాలని ఆ పార్టీ ఎలక్షన్ అథారిటీ  ప్రతిపాదించింది. ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికలు ముగిసిన అనంతరం పార్టీ సంస్థాగత ఎన్నికలను నిర్వహించాలని ప్రతిపాదించింది. దీనిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తుది నిర్ణయం తీసుకుంటుంది.