11 రౌండ్ల పాటు చర్చలు జరిగినా సరే… రైతులు ఏమాత్రం బెట్టు వీడకపోవడంతో కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకోడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇకపై తాము ప్రతిపాదించిన ప్రతిపాదనకు రైతు సంఘాలు ఓకే చెబితేనే ఇకపై తదుపరి రౌండ్ చర్చలకు తాము ముందుకు వస్తామని కేంద్రం తెగేసి చెప్పింది. ‘‘మేము మీ సమస్యలను పరిష్కరించాలని భావించాం. మేం తెచ్చిన ప్రతిపాదనలు చాలా బాగున్నాయి. అయినా దురదృష్టవశాత్తు మీరు వ్యతిరేకిస్తూనే ఉన్నారు.’’ అని తోమర్ రైతు సంఘాలతో అన్నట్లు సమాచారం.
కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా తాము తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ యథావిథిగా ఉంటుందని రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ స్పష్టం చేశారు. చర్చలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండేళ్ల పాటు చట్టాలను తాత్కాలికంగా నిలిపేస్తామని కేంద్రం ప్రతిపాదించిందని, ఈ ప్రతిపాదనకు సిద్ధంగా ఉంటేనే తదుపరి రౌండ్ సమావేశాలు జరుగుతాయని ప్రభుత్వం పేర్కొందని టికాయత్ వెల్లడించారు.
రైతుల సంక్షేమాన్ని రైతు సంఘాలు ఏమాత్రం కాంక్షించడం లేదని, అందుకే 11వ రౌండ్ చర్చలూ అసంపూర్ణంగానే ముగిశాయని తోమర్ మండిపడ్డారు. ఈ విషయంలో మాత్రం తాము చాలా బాధపడుతున్నామని పేర్కొన్నారు. చట్టాలపై ప్రత్యామ్నాయలను అన్వేషించాలని తాము ప్రతిపాదిస్తుంటే… చట్టాలనే పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్‌తో సంఘాలు పట్టుదలకు పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతిపాదనలను రైతుల శ్రేయస్సు దృష్ట్యా గమనంలోకి తీసుకోవాలని తాము పదే పదే విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. శనివారం లోగా వీటిపై రైతు సంఘాల అభిప్రాయాలను తెలపాలని తాము వారిని కోరామని తోమర్ వెల్లడించారు.
More Stories
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించిన ప్రధాని మోదీ
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
జార్ఖండ్‌కు అతిపెద్ద శత్రువులు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ