తిరిగి మోదీకే పట్టం.. ఇండియా టుడే సర్వే!

ఒక వంక కరోనా మహమ్మారితో భయకంపితులైన ప్రజలు, చైనాతో వివాదం, మరోవంక  చతికలపడిన దేశ ఆర్ధిక వ్యవస్థలతో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొంటున్నది. 2020 పౌరసత్వ సవరణ చట్టంకు నిరసనలతో ప్రారంభమై, రైతులు వ్యవసాయ చట్టాలకు నిరసనగా దేశ రాజధానిను ముట్టడించడంతో ముగిసింది. 
 
అయినా ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిపితే, తిరిగి నరేంద్ర మోదీ ప్రభుత్వం తిరిగి స్పష్టమైన ఆధిక్యతతో  అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే జరిపిన `మూడ్ అఫ్ ది నేషన్’ సర్వే వెల్లడించింది. ఎన్డీయేకు 321 సీటుకు వస్తాయని ఈ సర్వే తెలిపింది. గత ఆగష్టు లో జరిపిన సర్వే నాటికన్నా  ఐదు సీట్లు ఎక్కువ కావడం గమనార్హం. అయితే 2019లో గెల్చుకున్న 357 సీట్లకన్నా కొంచెం వెనుకబడి ఉంది. 
 
మరోవంక యుపిఎ కూటమికి గత ఆగుస్ట్ లో వలే 93 సీట్లు మాత్రమే వస్తాయని తేలింది. ఎన్డీయేకు మొత్తం మీద 42 శాతం ఓట్లు వస్తాయి. బిజెపికి సొంతంగా  ఆధిక్యతను అవసరమైన 272 సీట్లకన్నా 19 సీట్లు అదనంగా 291 సీట్లు వస్తాయని చెబుతున్నారు. 2019లో 52 సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్ కు ఈ సారి 51 సీట్లకు మించి రావని వెల్లడైనది. 
 
కరోనా సంక్షోభం మరోసారి ఎటువంటి సంక్షోభానైనా నిబ్బరంగా ఎదుర్కోగలరనే విశ్వాసాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పట్ల కలిగించిన్నట్లు ఈ సర్వే వెల్లడించింది. 74 శాతం మంది దేశ ప్రజలు ప్రధాని మోదీ పనితీరు అద్భుతం అంటూ పేర్కొన్నారు. మొత్తం మీద 66 శాతం మంది ప్రజలు మోదీ ప్రభుత్వం పనితీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేయడమో, బాగా సంతృప్తి వ్యక్తం చేయడమో చేశారు. 
 
ముస్లింలలో కూడా 38 శాతం మంది మోదీ ప్రభుత్వ తీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వే ప్రకారం ప్రజల దృష్టిలో ఈ ప్రభుత్వం చేసిన అత్యుత్తమైన అంశాలను ఏమిటంటే అయోధ్యలో రామమందిరం నిర్మాణంకు సుప్రీం కోర్ట్ మార్గం సుగమం చేయడం ఒకటి  కాగా, ఆర్టికల్ 370ని రద్దు చేయడం మరొకటి. 
 
70 శాతం మంది యూనిఫార్మ్ సివిల్ కోడ్ కావాలని కోరుకొంటుండగా, ఈ ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై 56 శాతం మంది ప్రజలు మద్దతు తెలిపారు. 38 శాతం మంది ప్రజలు తిరిగి మోదీ ప్రధాని కావాలని కోరుకొంటుండగా, రాహుల్ గాంధీని కేవలం 7 శాతం మంది మాత్రమే కోరుకొంటున్నారు. 
 
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ను రాహుల్ గాంధీ కన్నా ఎక్కువగా 10 శాతం మంత్రి ప్రధాని కావాలని కోరుకొంటున్నారు. కేంద్ర రక్షణ మంత్రి  రాజనాథ్ సింగ్ ను మరో 8 శాతం కోరుకొంటున్నారు. ఈ ప్రభుత్వపు గొప్ప వైఫల్యంగా నిరుద్యోగాన్ని ప్రజలు ఎక్కువగా పేర్కొన్నారు. 
 
మోదీ ప్రభుత్వం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం పట్ల దేశ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. 23 శాతం మంది అద్భుతమని చెప్పగా, మరో 50 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. 61 శాతం మంది తాము చికిత్సకోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళమని చెప్పగా, వారిలో 71 శాతం మంది చికిత్స పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 39 శాతం మంది ప్రజలు దేశ వ్యాప్త లాక్ డౌన్ కు సమర్ధన తెలిపారు. 
 
కోవిద్ కారణంగా ఎదురైనా ఆర్ధిక సంక్షోభాన్ని ఈ ప్రభుత్వం అద్భుతంగా ఎదుర్కొంటున్నదని 67 శాతం మంది చెప్పగా, 22 శాతం మంది ఒక మాదిరిగా ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.