ఎన్నికలంటే కేసీఆర్ వెనుకడుగు… జానారెడ్డికి మద్దతు!

తమ కుటుంబానికి మంచి పట్టున్న దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల్లో బిజెపి అభ్యర్థి  గెలుపొందడం, ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో సహితం బిజెపి  అధికార పార్టీకి దాదాపు దగ్గరగా సీట్లు గెలుపొందడంతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎన్నికలంటేనే భయపడుతున్నట్లు కనిపిస్తున్నది. 
 
అంతలో నాగార్జునసాగర్ ఎమ్యెల్యే నోముల నరసింహయ్య అకాల మరణం చెండంతో ఉపఎన్నిక అనివార్యం కావడం,  ఖమ్మం, వరంగల్, సిద్దిపేట మునిసిపల్ ఎన్నికలు కూడా జరుగవలసి ఉండడంతో కేసీఆర్ ఇరకాటంలో పడినట్లు కనిపిస్తున్నది. అదే సమయంలో హైదరాబాద్, వరంగల్ గ్రాడుయేట్ల స్థానాలకు ఎమ్యెల్సీ ఎన్నికలు కూడా జరగబోవడం అధికార పక్షానికి విషమ పరీక్షగా మారింది. 
 
ఈ ఎన్నికలలో కూడా బీజేపీ చెప్పుకోదగిన బలం చూపగలిగితే ఇక అధికార పక్షం టి ఆర్ ఎస్ లో ముసలం తధ్యమని,  తన ప్రభుత్వ ఉనికికే ప్రమాదకరమని కేసీఆర్ ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు. అందుకనే ఈ ఎన్నికలలో గెలుపుకన్నా బిజెపి బలం పుంజుకోకుండా వ్యూహరచనలో నిమగ్నమైన్నట్లు తెలుస్తున్నది. 
 
ముఖ్యంగా నాగార్జునసాగర్ కాంగ్రెస్ సీనియర్ నేత కె జానారెడ్డికి మంచి పట్టున్న ప్రాంతం కావడంతో అక్కడ టి ఆర్ ఎస్ బలమైన అభ్యర్థిని నిలబెడితే గెలుపు సాధించడంకన్నా కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కారణమై, బిజెపి అభ్యర్ధికి అనుకూలంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు. అందుకనే తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం కన్నా పేరుకు పోటీ  పెట్టినా, జానారెడ్డి గెలిచేటట్లు వ్యూహరచన చేయనున్నట్లు తెలుస్తున్నది. 
 
ఎందుకంటె జానారెడ్డి గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటూ అధికార పక్షంపై ఇబ్బంది పెట్టలేదు. సౌమ్యంగా ఉంటూ కాంగ్రెస్ నేతలకే అసహనం కలిగించే రీతిలో వ్యవహరించారు. అందుకనే జానారెడ్డి అసెంబీలో ఉండడంతో ప్రభుత్వానికి ఇబ్బంది అంటూ ఉండబోదని అంచానా వేస్తున్నారు. 
 
మరోవంక, రెండు గ్రాడ్యుయేట్ల ఎమ్యెల్సీ స్థానాలలో ఒక స్థానంలో బిజెపి గత ఎన్నికల్లో గెలుపొందింది. హైదరాబాద్ స్థానభంలో ఇప్పటివరకు టి ఆర్ ఎస్ గెలుపొందిన దాఖలాలు లేవు. దానితో పోటీ చేసి బిజెపి గెలుపుకు దోహదపడటంకన్నా బలమైన స్వతంత్ర అభ్యర్ధికి మద్దతు  ఇవ్వాలనే ఆలోచనలు చేస్తున్నారు. 
 
గతంలో ఇక్కడి నుండి ఎమ్యెల్సీగా రెండు సార్లు గెలుపొందిన సిపిఎం మద్దతు దారుడైన కె నాగేశ్వర్ తిరిగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు టి ఆర్ ఎస్ మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నది. కొంతకాలంగా సిపిఎం అధికార పక్షం పట్ల  సానుకూల ధోరణిలో వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం. 
 
మరోవంక, వరంగల్ స్థానంలో గత ఎన్నికల్లో టి ఆర్ ఎస్ గెలుపొందిన బీజేపీ సహితం తీవ్రమైన పోటీ ఇచ్చింది. ఇక్కడి నుండి కోదండరాం పోటీ చేస్తున్నా బిజెపి బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంది. టి ఆర్ ఎస్ లో ఎవ్వరు పోటీకి సహితం ముందుకు రావడం లేదు. అందుకనే బిజెపి అభ్యర్థిని ఓడించడం కోసం ఎవ్వరికీ మద్దతు ఇవ్వాలనే ఆలోచనలు చేస్తున్నట్లు చెబుతున్నారు.