రామాలయంపై కోరుట్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలకు బిజెపి ఆగ్రహం 

అయోధ్య రామాలయ నిర్మాణంపై కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జగిత్యాల జిల్లా, మెట్ పల్లిలో బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతంగా మారింది. ఎమ్మెల్యే విద్యాసాగర్ ను అడ్డుకునేందుకు పెద్దఎత్తున బీజేపీ నేతలు మెట్ పల్లికి చేరుకున్నారు. అక్కడే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు.. బీజేపీ నేతలను అడ్డుకున్నారు. 
 
పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేసినా బీజేపీ నేతలు తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేయగా బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.  
 
ఇరు వర్గాలను అక్కడినుంచి పంపించేసిన పోలీసులు. మెట్పల్లిలోని విద్యాసాగరరావు ఇంటిముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయోధ్య రామ మందిర్ నిర్మాణంపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు. అయోధ్యలో నిర్మించే రామాలయానికి చందాలివ్వొద్దని చెప్పారు.
బీజేపీ నేతలు అయోధ్య రామాలయం పేరుతో బిచ్చమెత్తు కుంటున్నారన్నారని అన్నారు. జగిత్యాలలో జరిగిన రెండో విడత గొర్రెల పంపిణీ సభలో ఈ విధంగా మాట్లాడుతూ మన గ్రామాల్లో రాముడు లేడా ఉత్తర ప్రదేశ్ లో రామాలయానికి చందాలెందుకు ఇవ్వాలని కామెంట్ చేశారు. బొట్టుపెట్టుకుంటేనే రామభక్తులా..  తాము కూడా శ్రీరాముని భక్తులమే అంటూ ఎమ్మెల్యే విద్యాసాగర్ వ్యంగ్యంగా మాట్లాడారు. దానితో రామభక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
కాగా, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేసిన కామెంట్లపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచందర్రావు సీరియస్ అయ్యారు. రామమందిరానికి చందాలివ్వొద్దని  టీఆర్ఎస్  ఎమ్మెల్యే చెప్పడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. వెంటనే ప్రజలకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రామాలయం నిర్మాణ నిధి చందా కోసం బీజేపీ ఎవరిపైనా ఒత్తిడి చేయడం లేదని స్పష్టం చేశారు.