ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్ల అమ‌లుకు కేసీఆర్ సిద్ధం 

కేంద్ర ప్రభుత్వ పధకాలను అమలు పరచకుండా వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఒకొక్క ప్రధమ అమలు ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ సన్మాన్ పధకాల అమలుకు నిర్ణయించిన ఆయన తాజాగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈ.డబ్ల్యు.ఎస్.) పదిశాతం రిజర్వేషన్ సౌకర్యం కూడా రాష్ట్రంలో అమలు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. 
 
రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉంద‌ని సీఎం ప్రకటించారు. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఈడబ్య్యుఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించామని పేర్కొ‌న్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఈడబ్ల్యుఎస్ తో కలుపుకుని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయ‌ని సీఎం వెల్లడించారు. దేశంలో అగ్రవర్ణాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు తెలంగాణలో మోక్షం రాబోతోంది.
రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చిన 10% రిజర్వేషన్లను కేంద్రంతోపాటు పలు ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నా.. ఇక్కడ మాత్రం అమలుకు నోచుకోవడంలేదు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడం లేదని, అన్ని కోర్సులకు అమలయ్యేలా సానుకూల నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఇటీవల సూచించిన విషయం తెలిసిందే.  ఈ రేజర్వేషన్లను అమలు పరచమని గత రెండేళ్లుగా బిజెపి వత్తిడి తెస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం స్పందించడం లేదు. 
ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై టీఆర్ఎస్ ప్రభుత్వం కళ్లు తెరిచిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రిజర్వేషన్లు అమలు నిర్ణయం తీసుకోవడం సంతోషం అని వ్యాఖ్యానించారు. ఇన్ని రోజులు కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల.. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయలేదన్నారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై ఈనెల 27న దీక్ష చేయాలనుకున్నట్లు చెప్పారు. కానీ బీజేపీ పోరాటానికి భయపడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని బండి సంజయ్‌ పేర్కొన్నారు.