దుబ్బాక ఉప ఎన్నిక , హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో విజయం సాధించినట్లుగానే త్వరలో జరుగబోయే ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలోను బీజేపీ విజయఢంకా కొనసాగుతుందని ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి భరోసా వ్యక్తం చేశారు. దుబ్బాక, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ గెలవగానే కేసీఆర్ కుటుంబానికి నిద్రపట్టడం లేదని వరంగల్ పర్యటన సందర్భంగా తెలిపారు.
ఎన్నికలలో ఓడపోతామనే భయంతో సీఎం కేసీఆర్ భయపడుతున్నారని ఆయన చెప్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను కేసీఆర్ పూర్తిగా విస్మరించారని ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాలు పెరిగాయని ధ్వజమెత్తారు.
ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటోందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పాలనలో వరంగల్ నగరం అభివృద్ధికి నోచుకోలేదని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ నాయకత్వంలో రోబోయే రోజులలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు జరుగుతుందని ఇంద్రసేనారెడ్డి అభయమిచ్చారు. మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం ప్రపంచంలో మన దేశానికి తిరుగులేదని స్పష్టం చేశారు. బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమని చెబుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత మోదీకే దక్కుతుందని పేర్కొన్నారు.

More Stories
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లపై బెదిరింపులు, బీఎల్ఓలపై వత్తిళ్లు
లైంగిక వేధింపులలతో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం