కేటీఆర్ సీఎం అవ్వాలని ఫాంహౌస్‌‌లో  కేసీఆర్ పూజలు

కొడుకు కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు  తన ఇంట్లో  పూజలు చేస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మోతీ నగర్‌‌లో నిర్వహించిన రామమందిరం నిధి సేకరణ కార్యక్రమంలో పాల్గొంటూ  అందుకోసమే  కేసీఆర్ ఫాంహౌస్‌‌లో మూడ్రోజుల పాటు దోష నివారణ పూజలు నిర్వహించారని చెప్పారు.

పూజా సామాగ్రిని త్రివేణి సంగమంలో కలపడానికే కుటుంబ సమేతంగా కేసీఆర్ కాళేశ్వరానికి వెళ్ళారని వెల్లడించారు. ‘కాళేశ్వరంలో సీఎం దంపతులు ఏమి కలిపారో చెప్పాలి. కేటీఆర్‌‌ను సీఎం చేసేందుకు చేసిన పూజా కలశాన్ని కలిపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం వెళ్లారని తన వద్ద  పక్కా సమాచారం ఉందని సంజయ్ స్పష్టం చేశారు.

కేటీఆర్‌ను సీఎంను చేయాలని  పగ్రతి భవన్‌లో చాలా టీవీలు పగులుతున్నాయట అంటూ ఎద్దేవా చేశారు. టీవీలు పగులుతున్న విషయాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారని పేర్కొన్నారు. ఉద్యమ ద్రోహులు‌‌ మాత్రమే కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటున్నారని, టీఆర్ఎస్‌లో ఉన్న నిజమైన ఉద్యమకారులకు కేటీఆర్ సీఎం కావటం ఇష్టం లేదని సంజయ్ ధ్వజమెత్తారు. 

కాగా, కాళేశ్వం ప్రాజక్టుపై ప్రజలను సీఎం మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. మూడో టీఎంసీతో సాధించిందేంటో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న మూడేళ్లలో లక్షల కోట్లు వెనకేసుకోవడానికి కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు.

ఎవర్ని సీఎంగా చేయాలనేది టీఆర్ఎస్ అంతర్గత సమస్య అని,  కానీ తెలంగాణ ఉద్యమకారుడు ఈటల రాజేందర్‌‌ను సీఎం చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఏం చూసి కేటీఆర్‌ను సీఎం చేయాలనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. కేటీఆర్ కంటే ఈటల రాజేందర్ చాలా బెటర్ కదా అంటూ నిలదీశారు. ఈటలను సీఎంగా వద్దనుకుంటే దళితుడ్ని సీఎం చేయాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో దళితుడ్ని సీఎం చేస్తానని కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేస్తూ ఆ మాటను ఆయన నిలబెట్టుకోవాలని సంజయ్ హితవు చెప్పారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని కాకుండా కొడుకును సీఎం చేస్తున్నారు. దళితుణ్ణి సీఎం ఎందుకు చేయడం లేదు. ఈటల, హరీశ్‌‌కు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కరోనా టైమ్‌‌లో సీఎం ఈటలను బద్నామ్ చేశారని సంజయ్ తెలిపారు. సీఎం కాళేశ్వరం ఎందుకు వెళ్ళారో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు తనకు చెప్పారని వెల్లడించారు. సీఎం అయ్యేందుకు ఇంట్లో పూజలు చేయాల్సి ఉండటంతో ఈ రోజు కేటీఆర్ తన కార్యక్రమాలు రద్దు చేసుకున్నారని సంజయ్ ఎద్దేవా చేశారు.