విశాఖలో కృష్ణ బోర్డు కు తెలంగాణ అభ్యంతరం 

కృష్ణా నదీ యాజమాన్య బోర్డును విశాఖకు తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. బోర్డును విశాఖ తరలించవద్దని చెప్పింది. సంబంధం లేని ప్రాంతంలో బోర్డు ఏర్పాటు చేయడం తగదని హితవు చెప్పింది. అటు కృష్ణా, ఇటు గోదావరి బేసిన్ల పరిధిలోని లేని విశాఖకు కృష్ణాబోర్డు కార్యాలయాన్ని ఎలా తరలిస్తారని ప్రశ్నించింది. ఈ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకొనేది లేదని, వెంటనే దానిని విరమించుకోవాలని సూచించింది.
ఈ మేరకు తెలంగాణ జలవనరులశాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు మంగళవారం కృష్ణా నదీ యజమాన్యబోర్డు సభ్యకార్యదర్శికి లేఖ రాశారు. కృష్ణానదీ యజమాన్య బోర్డు ప్రధానకార్యాలయంతోసహా రీజనల్‌, సబ్‌రీజనల్‌ సెంటర్లన్నీ కృష్ణా బేసిన్‌లోనే ఉండాలని స్పష్టంచేశారు.  కేఆర్‌ఎంబీ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తరలించాలని ఏపీ ఎప్పట్నుంచో చెప్తున్నదని, అందుకు తెలంగాణ కూడా అంగీకరించిందని ఈఎన్సీ మురళీధర్‌ లేఖలో గుర్తుచేశారు. విజయవాడలో భవనాన్ని ఎంపికచేసుకోవాలని బోర్డుకు తెలిపిన విషయాన్ని ప్రస్తావించారు.
2019 అక్టోబర్‌ 9న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం, 2020 అక్టోబర్‌16న ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొన్న అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో విజయవాడకు తరలింపుపై మాత్రమే చర్చ జరిగిందని స్పష్టం చేశారు. ఏ ఒక్క సమావేశంలోనూ విశాఖకు తరలింపు ప్రస్తావన రాలేదని పేర్కొన్నారు. కానీ, పలు పత్రికల్లో విశాఖకు తరలింపుపై వార్తలు రావడం విస్మయం కలిగిందని తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేస్తామంటే అంగీకారం తెలిపామని, ఇప్పుడు కృష్ణా బేసిన్‌ బయట, వేరొక ప్రాంతంలో 500 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడం వల్ల కార్యకలాపాలకు ఇబ్బందవుతుందని లేఖలో పేర్కొంది.
హైదరాబాద్ నుండి వెళ్లాలంటే 900 కిమీ దూరం అవుతుందని, ఉద్యోగులకు దూరాభారమే కాకుండా, కాలయాపనకు కూడా దారితీస్తుందని అభ్యంతరం తెలిపారు. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో ఈ విషయం చర్చించకుండా విశాఖలో ఏర్పాటు చేస్తామని చెప్పడం సరికాదని అభ్యంతరం తెలిపింది. దీంతో పాటు కృష్ణా బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా ఎపి మరికొన్ని ప్రాజెక్టుల నిర్మాణం చేపటినట్లు బోర్డు దృష్టికి తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చింది.