రైతు సంఘాలపై సుప్రీం కోర్ట్ ఆగ్రహం 

కొత్త వ్యవసాయ చట్టాల సమస్యను పరిష్కరించడం కోసం సుప్రీం కోర్టు నియమించిన నలుగురు సభ్యుల కమిటీకి వ్యతిరేకంగా పలు రైతు సంఘాల నేతలు, విపక్ష నాయకులు పలు రకాల వాఖ్యానాలు చేయడాన్ని సుప్రీం కోర్ట్ తీవ్రమైన అంశంగా పరిగణించింది. కమిటీపై అనుమానాలు వ్యక్తం చేయడం పట్ల అత్యున్నత ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

రైతుల‌తో చ‌ర్చించి, వారి అభిప్రాయాల‌ను ఓ నివేదిక రూపంలో తీసుకురావాల‌ని క‌మిటీకి చెప్పిన‌ట్లు సీజేఐ తెలిపారు. తాము ఏర్పాటు చేసిన క‌మిటీలో ఎటువంటి ఏక‌ప‌క్షం లేద‌ని, కోర్టుపై అనుమానాలు వ్య‌క్తం చేయాల్సిన అవ‌స‌రం లేదని సీజే స్పష్టం చేశారు. 

క‌మిటీ స‌భ్యుల‌కు ఎటువంటి అధికారాలు ఇవ్వ‌లేద‌ని, వాళ్లు కేవ‌లం నివేదిక మాత్ర‌మే ఇస్తార‌ని సీజే తెలిపారు. మీకు క‌మిటీ నుంచి హాజ‌రు కావాల‌ని లేకుంటే ఆ ప‌ని చేయ‌కండి, కానీ క‌మిటీ స‌భ్యుల‌పై మాత్రం ఆరోప‌ణ‌లు వేయ‌వ‌ద్దు అని సీజీ హితవు చెప్పారు. 

సుప్రీం ఏర్పాటు చేసిన కమిటీలో భూపీందర్ సింగ్ మాన్, ప్రమోద్ కుమార్, అశోక్ గులాటి, అనిల్ ఘన్వత్ ఉన్నారు. అయితే ఈ కమిటీని కొందరు రైతు సంఘాల ప్రతినిధులు తిరస్కరించారు. వీరంతా ప్రభుత్వానికి అనుకూల వ్యక్తులని, సాగు చట్టాలను సమర్థిస్తూ గతంలో వ్యాసాలు  రాశారని ఆరోపించారు. అలాంటి కమిటీ ముందు తాము హాజరు కాలేమని స్పష్టం చేశారు.

 కాగా, గ‌ణ‌తంత్ర దినోత్సవం రోజున రైతులు జరుప తలపెట్టిన ట్రాక్ట‌ర్ ర్యాలీని అడ్డుకోవాలంటూ దాఖ‌లైన పిటిష‌న్‌పై ఇవాళ మ‌రోసారి సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ట్రాక్ట‌ర్ ర్యాలీ విష‌యంలో అనుమ‌తి ఇచ్చే అంశాన్ని ఢిల్లీ పోలీసుల‌కే వ‌దిలేసిన‌ట్లు కోర్టు చెప్పింది. 
 
ఈ కేసులో ఎటువంటి ఆదేశాల‌ను తాము ఇవ్వ‌ద‌లుచుకోలేద‌ని కోర్టు పేర్కొన్న‌ది.  పోలీసులే తుది నిర్ణ‌యం తీసుకోవాల‌ని సీజే స్పష్టం చేశారు.  ట్రాక్ట‌ర్ ర్యాలీకి వ్య‌తిరేకంగా దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను ఉప‌సంహ‌రించాల‌ని కేంద్రాన్ని సుప్రీం కోరింది.  దానితో కేంద్రం తన పిటీషన్ ను ఉపసంహరించుకొంది.