చీలిక దిశగా పుదుచ్చేరిలో  కాంగ్రెస్‌, డిఎంకె కూటమి 

మరో కొద్దీ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పుదుచ్చేరిలో అధికారిక కాంగ్రెస్‌, డిఎంకె కూటమి మధ్య నెలకొన్న విబేధాలు చీలికకు దారితీస్తున్నయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ కూటమి ఇతర పార్టీలను క్లీన్‌స్వీప్ చేశారు. అయితే త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇరు పార్టీలు కలిసి పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. 
 
తమ పార్టీ కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేయనుందని డిఎంకె పుదుచ్చేరి ఇన్‌చార్జ్‌, ఎంపి ఎస్‌.జగత్రక్షకన్‌ ఒక సభలో ప్రకటించారు. పైగా, తామే విజయం సాధించి తీరుతామని  ధీమా వ్యక్తం చేశారు.  ఒకవేళ ఓడిపోతే.. ఆత్మహత్య చేసుకుంటానని కూడా సవాలు విసిరారు. 
 
దీంతో కూటమిలోని ఇరు పార్టీల మధ్య మనస్పర్థలు వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. తమిళనాడులో ఇరు పార్టీల మధ్యబలమైన సంబంధాలు ఉన్నప్పటికీ జగత్రక్షకన్‌ కారణంగానే ఇక్కడ కూటమి మధ్య సమస్యలు వచ్చాయని చెబుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలన్న అత్యుత్సాహంతోనే నారాయణ స్వామితో విబేధాలు తలెత్తేలా చేశారని విమర్శలు చెలరేగుతున్నాయి. 
 
మరోవైపు కాంగ్రెస్‌ తిరిగి అధికారం చేపట్టే అవకాశాలు సన్నగిల్లుతున్నందున తమ పార్టీ ప్రయోజనాలను కాపాడుకునేందుకు యత్నిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీ పిఎంకెతో ఈ ఎన్నికలలో డిఎంకె జత కట్టనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇందుకోసం జగత్రక్షకన్‌ ఆ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. 
 
నూతన వ్యవసాయ చట్టాలపై చర్చల నిమిత్తం ఇటీవల అధికారిక కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వహించిన అసెంబ్లీ సెషన్‌కు కూడా డిఎంకె హాజరుకాలేదు. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వికె. నారాయణస్వామి చేపట్టిన ఆందోళనలో కూడా డిఎంకె పాల్గనలేదు. 
 
మరోవైపు గతవారం డిఎంకె నేతలు మదురైలో ఏర్పాటు చేసిన జల్లికట్టు కార్యక్రమాన్ని చూసేందుకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ తమిళనాడుకు విచ్చేశారు. అయితే పుదుచ్చేరిలో మాత్రం పర్యటించలేదు. ఏదేమైనప్పటికీ పుదుచ్చేరిలో డిఎంకెకు కాంగ్రెస్‌తో సంబంధాలు ఎంత అవసరమో, అదేవిధంగా తమిళనాడులో కాంగ్రెస్‌కు డిఎంకెతో సత్సంబంధాలు అంత అవసరం కావడం గమనార్హం.