త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే కూటమిని ఓడించడం కోసం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే జైలు నుండి విడుదలై వస్తున్న మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళతో కలసి పనిచేయాలని తుగ్లక్ సంపాదకుడు, ప్రముఖ రాజకీయ పరిశీలకుడు ఎస్ గురుమూర్తి ఇచ్చిన పిలుపు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపడి కె పళనిస్వామిలో ఖంగారుకు దారితీస్తున్నట్లు కనిపిస్తున్నది.
మద్దతు ఇస్తున్న బిజెపి వంటి పార్టీలతో చర్చింపకుండానే ఏకపక్షంగా తమ ముఖ్యమంత్రి అభ్యర్థి పళనిస్వామి అని అన్నాడీఎంకే ప్రకటించేటట్లు చేయడం, ఆ మేరకు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రచారం ప్రారంభించడం కూడా శశికళ రంగప్రవేశం చేస్తే పరిస్థితులలో పెద్ద మార్పు రాగలదనే భయమే కారణమని పలువురు భావిస్తున్నారు. ఆమె ఈ నెల 27న జైలు నుండి విడుదల కానున్నారు.
ఈ సందర్భంగా సీఎం పళనిస్వామి ఢిల్లీ పర్యటనపై ఆసక్తి కలిగిస్తున్నది. సోమ, మంగళ వారాలలో ఢిల్లీలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలతో భేటీ తర్వాత మాట్లాడుతూ శశికళ తిరిగి తమ పార్టీలోకి వచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.
ఆమె మద్దతు దారులు అందరు అన్నాడీఎంకే లోకి తిరిగి వచ్చేశారని, కేవలం కొద్దీ మంది మాత్రమే ఆమెతో మిగిలి ఉన్నారని చెప్పారు. జయలలిత జీవించి ఉన్నప్పుడే ఆమెను పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంచారని, కేవలం ఆమె మరణం తర్వాతనే ఆమె పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారని తెలిపారు.
వచ్చే వారం ఆమె జైలు నుండి విడుదలై వస్తుండడంతో ఆమె తిరిగి తమ పార్టీలోకి ఇవస్తారనే కథనాలను ఆయన కొట్టిపారవేసారు. అయితే శశికళ, ఆమె మేనల్లుడు టిటివి దినకరన్ లను కలుపుకు పోతేనే వచ్చే ఎన్నికలలో గెలుపు సాధ్యం కాగలదని బిజెపితో పాటు అన్నాడీఎంకేలో పలువురు నాయకులు సహితం భావిస్తున్నారు.
దినకరన్ నాయకత్వంలోని ఎఎంఎంకే పార్టీని అన్నాడీఎంకేలో విలీనం చేయాలని కూడా సూచిస్తున్నారు. అందుకు దినకరన్ సుముఖంగా ఉన్నప్పటికీ పళనిస్వామిలో అభద్రతా భావం పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది. అయితే తాను ప్రధాని, కేంద్ర హోమ్ మంత్రిలతో రాజకీయాల గురించి చర్చింపలేదని, కేవలం రాష్ట్ర ప్రభుత్వంకు కేంద్రం నుండి రావలసిన నిధుల గురించే చర్చించానని పళనిస్వామి చెప్పారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంకు ప్రధానిని ఆహ్వానించినట్లు కూడా తెలిపారు.
ప్రస్తుతం తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా శశికళ అంగీకరించినా ఎన్నికల అనంతరం ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీరుసెల్వంను ఆ పదవిలో కూర్చోబెట్టడానికి ఆమె చక్రం తిప్పవచ్చని పళనిసామి వర్గం ప్రధానంగా ఆందోళన చెందుతున్నది.
జనవరి 27న జయలలిత మెమోరియల్‌ను సీఎం పళనిస్వామి ప్రారంభించనున్నారు. అదే రోజు జైలు నుంచి శశికళ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. జయలలిత చనిపోయిన అనంతరం జరిగిన అనూహ్య పరిణామాలతో సీఎం పదవి చేజారిపోయిన సందర్భంలో శశికళ ‘ప్లాన్ బి’ అమల్లోకి తెచ్చారు.
పార్టీని, ప్రభుత్వాన్ని తన గుప్పిటలో ఉంచుకోవడానికి శరవేగంగా పావులు కదిపి ఎమ్యెల్యేలతో శిబిరం నిర్వహించారు. ముఖ్యమంత్రిపీఠం నుంచి పనీర్ సెల్వాన్ని తప్పించి, తన అనుచరుడిగా ఆయనకు బద్ద వ్యతిరేకి అయినా పళనిస్వామిని చేశారు. అయితే ఆమె జైలుకు వెళ్లిన తర్వాత తన ప్రభుత్వ మనుగడకోసం పన్నీర్ సెల్వంతో చేతులు కలిపి, ఆమె వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. అందుకనే ఇప్పుడు ఆమెను తిరిగి పార్టీలో చేర్చుకోవాలి అంటే వెనకడుగు వేస్తున్నారు.
More Stories
లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ పై జనసేన వేటు
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?