పొరుగు దేశాలకు భారత్ కరోనా వ్యాక్సిన్    

భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ సహా  పొరుగున ఉన్న  సీషెల్స్ దేశాలకు నేటి నుంచి కింద కొవిడ్ -19 వ్యాక్సిన్లను సరఫరా చేయనున్నట్లు భారత్ ప్రకటించింది. దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే వారాలు, నెలల్లో భారత భాగస్వామి దేశాలకు సైతం వ్యాక్సిన్‌ సరఫరా చేయనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. 

వ్యాక్సిన్ల సరఫరా కోసం శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, మారిషస్ నుంచి అవసరమైన రెగ్యులేటరీ అనుమతుల నిర్ధారణ కోసం భారత్ ఎదురుచూస్తోంది. గ్లోబల్‌ కమ్యూనిటీ ఆరోగ్య అవసరాలను తీర్చడంలో ‘దీర్ఘకాల విశ్వసనీయ’ భాగస్వామిగా భారతదేశం ఎంతో గౌరవంగా ఉందని, అనేక దేశాలకు వ్యాక్సిన్ల సరఫరా బుధవారం ప్రారంభమవుతుందని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. 

ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ తయారీదారుల్లో భారత్‌ ఒకటి. కరోనా వ్యాక్సిన్‌ కోసం ఇప్పటికే పెద్ద సంఖ్యలో దేశాలు సంప్రదించాయి. దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాబోయే వారాలు, నెలల్లో దేశం భాగస్వామ్య దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేస్తుందని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. 

పొరుగు, ముఖ్య భాగస్వామ్య దేశాల నుంచి భారతీయ టీకాల కోసం అనేక అభ్యర్థనలు వచ్చాయని పేర్కొంది. కొవిడ్‌ మహమ్మారిపై పోరాడేందుకు, మానవాళి అందరికీ సహాయపడేందుకు భారత టీకా ఉత్పత్తి, డెలివరీ సామర్థ్యాన్ని ఉపయోగించుకునేందుకు ఇప్పటికే ఇచ్చిన ప్రకటన అనుగుణంగా భూటాన్‌, మాల్దీవులు, బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌, సీషెల్స్‌కు వ్యాక్సిన్‌ సరఫరా ప్రారంభవుతుందని తెలిపింది. 

శ్రీలంక, ఆఫ్గనిస్థాన్‌, మారిషస్‌ నుంచి అవసరమైన నియంత్రణ అనుమతుల నిర్ధారణ కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే దేశంలో భారీ కరోనా వ్యాక్సిన్‌ డ్రైవను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. సీరం ఇనిస్టిట్యూట్‌ తయారు చేసిన కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను ఆరోగ్య కార్యకర్తలకు ఇస్తోంది.

 కొవిడ్‌ సవాలను అధిగమించేందుకు ఫార్మసీ ఆఫ్‌ ది వరల్డ్‌ బట్వాడా చేస్తుందని విదేశాంగ మంత్రి జై శంకర్‌ ట్వీట్‌ చేశారు. విదేశాలకు సరఫరా చేసే సమయంలో దేశీయ అవసరాలను తీర్చేందుకు తగినన్ని నిల్వలు ఉండేలా చూసుకుంటామని విదేశాంగ శాఖ చెప్పింది.  

ఇలా ఉండగా, కొవిడ్ 19 వ్యాక్సిన్ కొవాగ్జిన్ 45 లక్షల డోస్‌లకు కేంద్రం భారత్ బయోటెక్‌కు అనుమతి మంజూరు చేసింది. ఈ 45 లక్షల డోస్‌ల్లో 8 లక్షల డోస్‌లు మిత్రదేశాలైన మారిషస్, ఫిలిప్పైన్స్, మయన్మార్ లకు ఉచితంగా ప్రభుత్వం సరఫరా చేయనుంది. ఇదివరకటి ఆర్డరు ప్రకారం 20 లక్షల డోస్‌లను రెండు రోజుల్లో ఆ కంపెనీ పంపనున్నట్టు వెల్లడించింది. 

55 లక్షల డోస్‌లకు ప్రభుత్వ ఆర్డరు లభించగానే మొదటి బ్యాచ్ వాక్సిన్లను భారత్ బయోటెక్ గన్నవరం (విజయవాడ), గువాహతి, పాట్నా, ఢిల్లీ, కురుక్షేత్ర, బెంగళూరు పుణె, భువనేశ్వర్, జైపూర్, చెన్నై, లక్నోలకు పంపింది. ఇంతేకాక ఉచితంగా 16.5 లక్షల డోస్‌లను ప్రభుత్వానికి అందచేసింది.