వాట్సాప్‌ గోప్యత మార్పులకు కేంద్రం అభ్యంతరం  

వాట్సాప్‌ గోప్యత మార్పులకు కేంద్రం అభ్యంతరం  

 వాట్సాప్‌ గోప్యత విధానం (ప్రైవసీ పాలసీ)లో ఇటీవల చేసిన మార్పులను ఉపసంహరించుకోవాలని ఆ సంస్థను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఏకపక్ష మార్పులు అనుచితమని, ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు వాట్సాప్‌ సీఈవోకి ఘాటుగా లేఖ రాసింది. 

వాట్సాప్‌కు ప్రపంచంలోనే భారత్‌ అతిపెద్ద మార్కెట్‌ అని గుర్తుచేసింది. గోప్యత విధానంలో ప్రతిపాదిత మార్పులకు ఆమోదం తెలుపడంపై వినియోగదారులకు ఛాయిస్‌ ఇవ్వకపోవడం భారత పౌరుల స్వతంత్రతపై ఆందోళనకు దారితీస్తున్నదని  తెలిపింది. దేశ పౌరులకు సముచిత గౌరవం ఇవ్వాలని స్పష్టం చేసింది. 

భారత్‌లో అందిస్తున్న సేవల వివరాలను సమర్పించాలని వాట్సాప్‌ను కేంద్రం ఆదేశించింది. యూజర్ల నుంచి ఎలాంటి సమాచారం సేకరిస్తున్నారు? వేటికి అనుమతులు, సమ్మతి కోరుతున్నారో తెలుపాలని కోరింది. అలాగే భారత్‌, ఇతర దేశాల్లో గోప్యత విధానంలో ఉన్న తేడాలను వివరించాలని ఆదేశించింది. 

సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్‌బుక్‌ అనుబంధ కంపెనీలతో పంచుకోవటం దేశ ప్రజల సమాచార గోప్యత, భద్రత, స్వతంత్రత హక్కులకు విఘాతం కల్పించటమేనని తెలిపింది. తమ మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో డేటాను పంచుకునేందుకు వీలుగా వాట్సాప్‌ నూతన ప్రైవసీ పాలసీని తెచ్చిన విషయం తెలిసిందే.

ఈ విధానానికి ఫిబ్రవరి 8లోగా ఆమోదం తెలుపాలని యూజర్లకు గడువు విధించింది. దీనిపై నిరసన వ్యక్తం చేసిన యూజర్లు వాట్సాప్‌ను తొలగించి, ప్రత్యామ్నాయ యాప్‌ల వైపు వెళ్లారు. దీంతో కొత్త పాలసీపై వాట్సాప్‌ దిగివచ్చింది. దీనిని మే వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

ఏ డిజిటల్‌ మాధ్యమమైనా.. అది వాట్సాప్‌ కానీ, ఫేస్‌బుక్‌ కానీ.. దేశంలో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు. అయితే దేశ ప్రజల హక్కులకు విఘాతం కలిగించరాదు. వ్యక్తిగత సందేశాల పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.