ప్రతిపక్షంలో ఉన్నపుడే రైతుల పట్ల సానుభూతి ప్రకటిస్తారా?  

ప్రతిపక్షంలో ఉన్నపుడే రైతుల పట్ల సానుభూతి ప్రకటిస్తారా? అంటూ బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసారు. అన్నదాతలు దశాబ్దాల తరబడి పేదలుగా ఎందుకు మిగిలిపోయారని ట్విట్టర్ వేదికగా ఆ పార్టీని ప్రశ్నించారు. దేశంలోని రైతులను కాంగ్రెస్ తప్పుదోవపట్టిస్తోందని మండిపడ్డారు. 

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వ హయాంలో స్వామినాథన్ కమిటీ నివేదికను ఎందుకు అమలు చేయలేదని నడ్డా ప్రశ్నించారు. యూపీయే హయాంలో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను ఎందుకు పెంచలేదని నిలదీశారు. 

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రైతులను రెచ్చగొడుతున్నారని, తప్పుదోవపట్టిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో అనేక దశాబ్దాలపాటు రైతులు పేదలుగా ఎందుకు మిగిలిపోయారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ నెలవారీ సెలవుల నుంచి ఇప్పుడే తిరిగొచ్చారని నడ్డా ఎద్దేవా చేశారు.

చైనాతోనూ, చైనా కమ్యూనిస్టు పార్టీతోనూ కాంగ్రెస్ పార్టీ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలనే ఉద్దేశం రాహుల్ గాంధీకి ఉందా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కుటుంబ సభ్యుల నియంత్రణలో ఉన్న ట్రస్టులకు చైనా విరాళాలను తిరిగి ఇచ్చేసే ఉద్దేశం ఆయనకు ఉందా? అన్నారు.  చైనా సొమ్ము, ఒప్పందం నిర్దేశకత్వంలోనే కాంగ్రెస్ విధానాలు, ఆచరణలు కొనసాగుతాయా? అని అడిగారు.

వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలు రద్దు కాబోతున్నట్లు రాహుల్ గాంధీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని నడ్డా మండిపడ్డారు. ఈ కమిటీలపై చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టలేదా? అని నిలదీశారు. 

రాహుల్ గాంధీ తమిళనాడులో జల్లికట్టును చూసి, ఆనందించారని, ఈ క్రీడను కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఎందుకు నిషేధించిందని, తమిళ సంస్కృతిని ఎందుకు అవమానించిందని ప్రశ్నించారు. భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలను గర్వకారణంగా రాహుల్ భావించడం లేదా? అని ప్రశ్నించారు. తన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పే ధైర్యాన్ని రాహుల్ గాంధీ కూడగట్టుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 

‘‘రాహుల్ గాంధీ, ఆయన వంశం, కాంగ్రెస్ చైనా గురించి అబద్ధాలు చెప్పడం ఎప్పుడు ఆపుతారు? ఆయన ప్రస్తావించిన అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతంతో సహా వేలాది కిలోమీటర్ల భూమిని చైనాకు బహుమతిగా ఇచ్చినది మరెవరో కాదు పండిట్ నెహ్రూయేననే విషయాన్ని ఆయన నిరాకరించగలరా? చైనాకు కాంగ్రెస్ మళ్ళీ మళ్ళీ ఎందుకు లొంగిపోతోంది?’’ అని నడ్డా ప్రశ్నించారు.