తాత్కాలికంగా చట్టాల అమలు నిలిపివేత… కేంద్రం ప్రతిపాదన!

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తూ ఒకటిన్నర ఏడాది నుండి రెండేళ్ల వరకు అమలు నిలిపి వేస్తామని తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు నేడు రైతులతో జరిగిన 10వ విడత చర్చలలో ఆ మేరకు సుప్రీం కోర్ట్ లో అఫిడవిట్ సమర్పిస్తామని కూడా కేంద్ర మంత్రులు చెప్పారు. 

అందుకు రైతులు విముఖత వ్యక్తం చేసినప్పటికీ ఈ నెల 22న జరిగే తరువాతి చర్చలో ఒక అంగీకారం కుదరగలదనే ఆశాభావాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యక్తం చేశారు.  కేంద్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌదరి పాల్గొన్నారు. రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య 10వ విడత చర్చలు ఈ నెల 19న జరగవలసింది. అయితే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సమావేశమవడంతో ఈ చర్చలను బుధవారానికి వాయిదా వేశారు.

‘వ్యవసాయ చట్టాలను ఏడాది, ఏడాదిన్నర నిలుపుదల చేస్తామని కేంద్రం ప్రతిపాదించింది. తమ మాట మీద నమ్మకం లేకుండా సుప్రీంలో అండర్ టేకింగ్ ఇస్తామని చెప్పింది. రైతులు, ప్రభుత్వ ప్రతినిధులతో సంయుక్తంగా కమిటీ ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించింది. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుందామని చెప్పింది’ అని రైతుల సంఘాల ప్రతినిధి కవిత కూరగంటి వెల్లడించారు.

కేంద్రం ప్రతిపాదనపై రైతు సంఘాల నేతలు రేపు సింఘు బోర్డర్ వద్ద సమావేశమై చర్చించుకుంటామని, ప్రభుత్వ ప్రతిపాదన రైతు ప్రయోజనాలు కాపాడేలా ఉందా లేదా అన్నది చర్చిస్తామని ఆమె తెలిపారు. తదుపరి నిర్ణయాన్ని ఈనెల 22న జరిగే భేటీలో కేంద్రానికి తెలియజేస్తామని చెప్పారు.

రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వం మధ్య 10వ విడత చర్చలు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో బుధవారం జరిగాయి. నూతన సాగు చట్టాలను రద్దు చేయబోమని, అవసరమైతే సవరణలకు సిద్ధమేనని ప్రభుత్వం తెలిపింది. రైతు సంఘాలు ఈ చట్టాలపై సుప్రీంకోర్టులో అపీలు చేయవచ్చునని పేర్కొంది.ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, రైతు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, తమకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నోటీసులు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఎన్ఐఏ తమను వేధిస్తోందని చెప్పారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ, ఈ విషయాన్ని పరిశీలించనున్నట్లు తెలిపింది.

సమావేశానంతరం రైతు ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ, కోర్టులో అఫిడవిట్ సమర్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తమకు చర్చల్లో తెలియజేసిందని, ఇందుకోసం ఏడాదిన్నర పాటు చట్టాల అమలును నిలిపి ఉంచుతామని చెప్పిందని ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా తెలిపారు.  

కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), మూడు చట్టాలపై కమిటీ వేస్తామని, కమిటీ సిఫారసులు అమలు చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై గురువారంనాడు తాము సమావేశమై చర్చిస్తామని హన్నన్ మొల్లా తెలిపారు.   

ఈ చర్చలకు ముందు నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవాల గౌరవానికి భంగం కలగకుండా జాగ్రత్తవహించవలసిన బాధ్యత రైతు సంఘాలకు కూడా ఉందని సూచించారు. గణతంత్ర దినోత్సవాలనాడు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలన్న నిర్ణయాన్ని వారు పునఃపరిశీలిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.