ఎన్నికల తర్వాతనే బెంగాల్ బీజేపీ సీఎం అభ్యర్థి 

త్వరలో జరిగే పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించబోమని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలిపింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాతే ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని బీజేపీ ప్రధాన కార్యదర్శి, పశ్చిమ బెంగాల్ బీజేపీ ఇన్‌ఛార్జ్ కైలాశ్ విజయవర్గీయ ప్రకటించారు.

శాసన సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి కావాలో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారని చెప్పారు. గతవారం బెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ యువమోర్చ నేత ఒక సభలో పేర్కొనడంతో చెలరేగిన ఊహాగానాల మధ్య ఆయన ఈ వివరణ ఇచ్చారు.

పశ్చిమ బెంగాల్ శాసన సభలో 294 స్థానాలు ఉన్నాయి. ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 200కు పైగా స్థానాలను గెలుస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. బీజేపీ అద్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే అనేకసార్లు రోడ్ షోలు, సభలు నిర్వహించారు. 

ఇక మీదట వీరితోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా రాష్ట్రంలో సభలు నిర్వహించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. నేతాజీ సుభాశ్ చంద్రబోస్ 125వ జయంత్యుత్సవాల సందర్భంగా మోదీ ఈ నెల 23న కోల్‌కతాలో ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. 

మరోవంక, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను విడిచిపెడుతున్న నేతల జాబితా పెరుగుతోంది. మమతా టీమ్‌ నుంచి మరొక ఎమ్మెల్యే బయటకు వచ్చేశారు. శాంతిపూర్ ఎమ్మెల్యే అరిందర్ భట్టాచార్య బుధవారం  బీజేపీలో చేరారు. 

న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ పశ్చమబెంగాల్ ఇన్‌చార్జి కైలాష్ విజయవర్గీయ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో భట్టాచార్య మాట్లాడుతూ, తనలాంటి యువనేతలను టీఎంసీ నాయకత్వం ఎదగనీయడం లేదని విమర్శించారు. 

‘ఎన్నో ఆశలతో టీఎంసీలో చేరాను. నా ప్రాంతానికి ఎంతో చేయాలని అనుకున్నాను. ప్రజలకు చేతనైనంత సేవ చేసే ప్రయత్నం చేశాను. అయితే నాలాంటి వారిని ఎదగనీయడం లేదు. పార్టీ మా చేతులు కట్టేసింది. తమ ప్రాంతాలను అభివృద్ధి చేయగలిగే సమర్ధ నాయకులున్నా వారిని పార్టీ ఉపయోగించుకోవడం లేదు’ అని భట్టాచార్య ఆరోపించారు. బెంగాల్‌లో పరిశ్రమలు లేవనీ, ప్రజలకు ఉద్యోగాలు లేవని, టీఎంసీ ప్రభుత్వాన్ని భవిష్యత్ వ్యూహాలు లేనే లేవని తప్పుపట్టారు. పశ్చిమబెంగాల్ ప్రజలు మోదీకి, బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు.

ఇలా ఉండగా, ప్రముఖ వ్యాపారవేత్త, దేశంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన ఆదిత్యా బిర్లా గ్రూప్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రంజన్‌ ముఖర్జీ బీజేపీలో చేరారు. బెంగాల్‌లో మార్పుకు వేళయ్యిందని ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్ర ప్రజలకు సేవచేసుకునేందుకు బీజేపీ తనకు అవకాశం కల్పించనట్లుగా భావిస్తున్నానని వెల్లడించారు.
‘రాష్ట్రానికి పరిశ్రమలను భారీ సంఖ్యలో తీసుకురావాల్సి ఉంది. దీనివల్ల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అయితే ప్రస్తుతం బెంగాల్‌లో ఉన్న పరిస్థితుల్లో మార్పు రావాల్సి ఉంది. అప్పుడే పరిశ్రమలు వాటంతట అవే వస్తాయి. రాష్ట్రాన్ని తాను దేశంలోనే మొదటి స్థానంలో చూడాలనుకుంటున్నాను. దానికోసం ఏం  చేయడానికైనా సిద్ధమే. మనం కష్టపడి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది’ అని పేర్కొన్నారు.