
రిపబ్లిక్ డే రోజున రైతులు చేపట్టనున్న ట్రాక్టర్ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతించారు. అయితే కఠిన ఆంక్షలతో పాటు పోలీసుల పర్యవేక్షణలోనే ఈ ర్యాలీ జరగాలని ఆదేశించారు. పరిమిత సంఖ్యలో రైతులు పాల్గనాలని, ర్యాలీ మొత్తం పోలీసుల పర్యవేక్షణలోనే సాగాలని, ముందుగా గుర్తించిన రహదారుల్లో మాత్రమే సాగాలంటూ పలు ఆంక్షలు విధించారు.
మొదట రిపబ్లిక్ డే రోజున ఎర్రకోట వద్ద పరేడ్ జరగనున్న నేపథ్యంలో ట్రాక్టర్ ర్యాలీ సమస్యాత్మకం కాకుండా ఉండేలా చూడాలని పలువురు అధికారులు రైతు నేతలతో చర్చలు జరుపుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఒకవేళ రైతులు ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లైతే పోలీసులు తమ బలాన్ని ప్రయోగించేందుకు కూడా సిద్ధమైనట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ర్యాలీ జరిగే ప్రాంతం, రైతుల సంఖ్య, ట్రాక్టర్ల సంఖ్యపై ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితేనే ఈ ర్యాలీకి అనుమతి ఇవ్వవచ్చని ఆ వర్గాలు తెలిపాయి. వాహనాల నెంబర్లు, ఆర్‌సి బుక్, డ్రైవర్ల పేర్లు, ఈ ర్యాలీలో పాల్గనే ఇతరుల వివరాలను ముందుగా జాబితా చేసి ఉంచాలని భావిస్తున్నట్లు ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
కాగా, ట్రాక్టర్ ర్యాలీకి వ్యతిరేకంగా నిబంధనలు జారీ చేయాల్సిందిగా ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను రాజధానిలోకి ప్రవేశించకుండా పోలీసులు సమర్థవంతంగా అడ్డుకుంటారని, పూర్తి నిర్ణయాధికారం వారిదేనని కోర్టు పేర్కొంది.
మరోవైపు రిపబ్లిక్ డే వేడుకలకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలోని 87వేల మంది పోలీసు సిబ్బందిలో సుమారు 75 శాతం (65వేల మందికి పైగా) 26న విధుల్లో కొనసాగనున్నారు. ప్రధాన రహదారులతో పాటు కూడళ్లు, చెక్‌పోస్టుల వద్ద పోలీసులను మోహరించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
బారికేడ్లు, వాటర్ కెనాన్‌లు, టియర్‌గ్యాస్ వాహనాలు, క్రేన్లను ఉంచినట్లు తెలిపారు. అలాగే సిసిటివి కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. యుఎవిలు, పారాగైడర్లు, బెలూన్‌లు, ఇతర ప్రైవేట్ విమానాలను ఢిల్లీలో జనవరి 20 నుండి 27 వరకు నిషేధిస్తున్నట్లు ఆదేశాలు కూడా జారీ అయినట్లు అధికారులు తెలిపారు.
More Stories
దేశ పౌరులు చట్టం తమదేనని భావించాలి
హత్యకు ముందు భారత్ పై దాడులకు నిజ్జర్ భారీ కుట్రలు
బీజేపీ మహిళా కార్యకర్తలకు ప్రధాని మోదీ పాదాభివందనం!