ఈ మధ్యనే బీజేపీలో చేరిన మాజీ మంత్రి సువెందు అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిగ్రామ్ నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తా అంటూ టిఎంసి అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించిన కొద్దీ సేపటికే ఆమె అక్కడి నుండి పోటీ చేస్తే 50 వేలకు పైగా ఆధిక్యతతో ఓడిస్తా అంటూ సుబేందు అధికారి సవాల్ విసిరారు. ఆమెను ఓడించలేని పక్షంలో రాజకీయాల నుండి శాశ్వతంగా వైదొలుగుతామని స్పష్టం చేశారు.
దానితో ఆయన టిఎంసి నుండి పోటీ చేసి, బీజేపీలో చేరినప్పటి నుండి ఆయనకు, మమతకు మధ్య పరోక్షంగా జరుగుతున్న మాటల యుద్ధం ముఖాముఖిగా మారింది. కోల్‌కతాలో జరిగిన ఓ ర్యాలీలో సుబేందు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మమతను 50,000 ఓట్లతో ఓడించి తీరుతా… లేదంటే రాజకీయాల నుంచే వైదొలుగుతా’’ అని సుబేందు సంచలన ప్రకటన చేశారు. తృణమూల్ రాజకీయ పార్టీ కాదని, అదో ప్రైవేట్ కంపెనీ అని ఎద్దేవా చేశారు.
టీఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం పక్క రాష్ట్రం నుంచి ప్రశాంత్ కిశోర్‌ను అద్దుకు తెచ్చుకున్నారని, దీన్ని బట్టే బీజేపీ గెలిచిపోతోందని అర్థమైపోతోందని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల సమయం వచ్చినప్పుడే సీఎం మమతకు నందిగ్రామ్ గుర్తొస్తుందని, ఆమె నందిగ్రామ్ కోసం ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు.
అంతకు ముందు ఒక బహిరంగసభలో మాట్లాడుతూ తాను కోల్‌కతాలోని బాబనిపుర్‌తో పాటు నందీగ్రామ్ నియోకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు. అది తనకు కలిసివచ్చే స్థానం అని దీదీ ప్రకటించారు. గతంలో నందీగ్రామ్‌లో రైతు ఉద్యమం చేపట్టిన మమతా బెనర్జీ.. 2011లో అసెంబ్లీ ఎన్నికలను సొంతం చేసుకున్నారు.
ఇలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 23న ఆయన బెంగాల్‌లో పర్యటించనున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని కేంద్ర సాంస్కృతిక శాఖ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
More Stories
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
సినీ నటి జేత్వాని వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్లపై వేటు