క్షమాపణ చెప్పిన ‘తాండవ్’ .. శాంతించని జనం 

హిందువుల మనోభావాలను గాయపరిచిన ‘తాండవ్’ వెబ్ సిరీస్‌ యూనిట్  ఎక్కకెలకు బేషరతుగా క్షమాపణ చెప్పింది.  అమెజాన్ ప్రైమ్ వేదికగా జనవరి 15న విడుదలైన హిందీ వెబ్ సిరీస్ ‘తాండవ్’ ఆ వివాదానికి కారణమైంది. ‘తాండవ్’ వెబ్ సిరీస్‌లోని ఓ సన్నివేశం హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉందని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. చిత్ర యూనిట్‌కు వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. 
 
ఈ వివాదం చిలికిచిలికి గాలివానగా మారడంతో ఈ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించిన నటుడు సైఫ్ అలీఖాన్ ఇంటికి భద్రత కల్పించారు. ఈ వివాదంపై సమాచారపౌర సంబంధాల శాఖ అమెజాన్ ప్రైమ్‌ను వివరణ కోరింది. దీంతో ఈ వివాదంపై ఎట్టకేలకు వెబ్‌ సిరీస్ నిర్మాతలు స్పందించారు. ‘తాండవ్’ వెబ్‌సిరీస్ పూర్తి కల్పితమైనదని, ఇందులో పాత్రలు, వ్యక్తులు ఏ ఒక్కరిని పోలినట్టుగా అనిపిస్తే.. అది కేవలం యాదృచ్ఛికమే తప్ప మరొకటి కాదని ‘తాండవ్’ యూనిట్ ప్రకటన చేసింది.

ఇందులో నటించిన వ్యక్తులకు గానీ, వెబ్ సిరీస్ నిర్మాణంలో భాగమైన వారికి గానీ ఏ ఒక్క వ్యక్తిని, కులాన్ని, మతాన్ని, మత విశ్వాసాలను కించపరిచే ఉద్దేశం లేదని తెలిపింది. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే బేషరతుగా క్షమాపణ చెబుతున్నట్టు ‘తాండవ్’ యూనిట్ ప్రకటించింది.

అయితే.. ఈ వెబ్ సిరీస్ నుంచి హిందూ దేవుళ్లను, దేవతలను కించపరిచే సన్నివేశాలను ఎట్టి పరిస్థితుల్లో తొలగించాల్సిందేనని పలువురు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలోను దీనిపై మండిప‌డుతున్నారు. ‘తాండవ్’‌లో హిందూ దేవుళ్లను కించపరిచారని బీజేపీ ఎమ్మెల్యే రామ్‌కదమ్ ముంబైలోని ఘట్కోపర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ల‌క్నోలోను ఈ వెబ్ సిరీస్‌పై కేసు న‌మోదైంది.

అయితే క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ప్ప‌టికీ బీజేపీ శాంతించ‌డం లేదు. వ‌చ్చే మూడు రోజుల‌లో అమెజాన్‌కు వ్య‌తిరేఖంగా ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌క‌పోతే మ‌హారాష్ట్ర వికాస్‌ అఘాడి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేఖంగా నిర‌స‌న‌లు చేస్తాం అంటూ బీజేపీ నాయ‌కుడు రామ్ క‌ద‌మ్ అన్నారు.

తాండవ్ యూనిట్ అంద‌రిని జైలుకు పంప‌క‌పోతే అమెజాన్ ప్రొడ‌క్ట్స్‌ని బ్యాన్ చేయాలంటూ ప్ర‌చారం చేస్తాము. ఉద్ద‌వ్ ఠాక్రే ప్ర‌భుత్వం హిందువుల మ‌నోభావాల‌ను పట్టించుకోవ‌డం లేదు.  రాష్ట్ర ప్రభుత్వం కనుక ఎఫ్ఐఆర్ దాఖలు చేయకపోతే మేము మా నిరసనను మరింత  ముమ్మరం చేస్తాము. అమెజాన్‌కు , తాండవ్ ఫిలిం మేక‌ర్స్‌కు వ్య‌తిరేఖంగా రానున్న రోజుల‌లో మా నిర‌స‌న‌ను ఉదృతం చేస్తాము అంటూ బిజెపి మీడియా యూనిట్ అధిపతి విశ్వస్ పాథక్ అన్నారు.

పోలీటికల్‌ డ్రామా వెబ్‌ సిరీస్‌ను దర్శకుడు‌ అలీ అబ్బాస్‌ రూపొందించగా, హిమాన్షు కిశన్‌ మెహ్రాతో కలిసి నిర్మించారు. ఇందులో డింపుల్‌ కపాడియా, సునీల్‌ గ్రోవర్‌, తిగ్మన్షు ధులియా, గౌహర్‌ ఖాన్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు.