కేసీఆర్ కనుసన్నల్లో  తెలంగాణ కాంగ్రెస్ నేతలు 

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు కేసీఆర్ కనుసన్నల్లో పని చేస్తున్నారని బిజెపి ఎంపీ డి అరవింద్ ధ్వజమెత్తారు. ఆర్మూర్ లో జరిగిన జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఎవరనేది కేసీఆర్ నిర్ణయించే హీన స్థితికి కాంగ్రెస్ చేరిందని ఎద్దేవా చేశారు. దేశంలోనే కాంగ్రెస్ కనుమరుగైపోయినదని తెలిపారు.

జిల్లా అభివృద్ధిపై మంత్రి ప్రశాంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని మండిపడుతూ జిల్లాలో రైల్వే బ్రిడ్జిల నిర్మాణాన్ని అడ్డుకుంటుంది మంత్రి ప్రశాంత్ రెడ్డే అని విమర్శించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురించి మాట్లాడే అర్హత ప్రశాంత్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజల ఆరోగ్యానికి భరోసా లేదని చెబుతూ ప్రజలకు ఆరోగ్య భీమా కల్పించని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని దయ్యబట్టారు. మిషన్ భగీరథలో వేల కోట్లు కమీషన్ల రూపంలో దండుకున్నారని ఆరోపించారు. అగ్రవర్ణ పేదలకు కూడా 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ప్రధాని మోదీదే అని తెలిపారు.

పసుపు రైతులకు మద్దతు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయడం చేతకాని సీఎం కేసీఆర్ అని ధ్వజమెత్తారు. పసుపు రైతులను ఆదుకునేందుకు లక్ష కోట్ల నిధిని కేంద్రం కేటాయించిందని, ..దేశంలో పసుపు దిగుమతిని నిషేధించింది అరవింద్  తెలిపారు. నిజాం షూగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని బోధన్ ప్రజలను మభ్య పెట్టిన ఘనత కేసీఆర్ దే అని గుర్తు చేశారు.

కేసీఆర్ తీరుతో చెరుకు రైతులు ఆందోళనలో ఉన్నారని అరవింద్ చెప్పారు. కేంద్ర వ్యవసాయ చట్టాల్లో కొనుగోలు కేంద్రాలు తీసేయాలని ఎక్కడ లేదని స్పష్టం చేశారు. రైతులకు మంచి చేయాలనే ఆలోచనతో కొత్త చట్టాలు తెచ్చామని చెబుతూ మక్క, సన్న రకం ధాన్యం సాగు చేసిన రైతులను టీఆర్ఎస్ మోసం చేసిందని మండిపడ్డారు. 

కేంద్రం వ్యాక్సిన్ లు పంపితే . వాటిని తామే సాధించినట్లు టీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు పెట్టారని అరవింద్ ఎద్దేవా చేశారు. నిరుద్యోగులను నిర్లక్షం చేస్తున్నారని అంటూ కేసీఆర్ పచ్చి అబద్ధాల కోరు అని అరవింద్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖునీ అయిందని, అవినీతి రాజ్యమేలుతుందని పేర్కొంటూ కేసీఆర్, ఆయన కుటుంబం జైలుకు వెళ్ళటం ఖాయమని స్పష్టం చేశారు. 

రాష్ట్రాన్ని కేసీఆర్ రూ. 4 లక్షల కోట్లు అప్పుల పాలు చేశారని అరవింద్ విమర్శించారు. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని చెబుతూ  బీజేపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని, అయినా చలించమని స్పష్టం చేశారు. కార్యకర్తలందరూ కలిసి పని చేయాలని కోరుతూ వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని అరవింద్ భరోసా ఇచ్చారు.