తెలంగాణలో గడీల పాలనకు త్వరలోనే చెక్ 

తెలంగాణలో  గడీల పాలనకు త్వరలోనే చెక్ పెడతామని, సీఎం కేసీఆర్ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ పిలుపిచ్చారు.  వికారాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ తోపాటు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణను కేసీఆర్‌ కబంధ హస్తాల నుంచి కాపాడుకునేందుకు ప్రజలంతా ఓటు బ్యాంకుగా మారాలని కోరారు.
 
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌ మాజీ మంత్రి చంద్రశేఖర్‌కు బీజేపీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  కష్టపడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్‌ కబంధ హస్తాల నుంచి కాపాడుకునేందుకు ప్రజలంతా ఓటు బ్యాంకుగా మారాలని సంజయ్  కోరారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తాండూరు బండకేసి కొడతారన్న భయంతోనే కేసీఆర్‌ వికారాబాద్‌ జిల్లా మొహం చూడడం లేదని ఎద్దేవా చేశారు. 
 
వికారాబాద్‌ గడ్డపై తెలంగాణ ద్రోహులకు స్థానం లేదని స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పండబెట్టి జిల్లా భూములను బీళ్లుగా మర్చాడని, దీంతో రైతులు ఎకరాలు, గుంటల లెక్క అమ్ము కుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను పేరు మార్చి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మళ్లిస్తోందని దయ్యబట్టారు.  వికారాబాద్‌ను జోగులాంబ జోన్‌ నుంచి హైదరాబాద్‌ జోన్‌లోకి తీసుకు వచ్చేదాకా కొట్లాడతామని ఆయన హామీ ఇచ్చారు.
పార్టీ రాష్ట్రఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌ మాట్లాడుతూ, ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్‌ నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకేఅరుణ మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్లు మార్చి జిల్లా రైతులకు సాగునీరు అందకుండా చేశారని ఆరోపించారు. రూ.10 వేల కోట్లతో అయ్యేది రూ.60 వేల కోట్లకు అంచనా వ్యయం పెరిగినా సాగునీరు వచ్చే అవకాశం కనిపించడం లేదని దయ్యబట్టాన్నారు. ఓబీసీ సెల్‌ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే దమ్ము బీజేపీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు.
పార్టీలో చేరిన మాజీ మంత్రి డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కేంద్ర నిధులను రాష్ట్ర నిధులుగా కేసీఆర్‌ చూపిస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు కాకపోతే తల నరుక్కుంటా అన్న కేసీఆర్‌ని ఐపీసీ 309 కింద అరెస్టు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోతే కోర్టులో ప్రైవేట్‌ కంప్లైంట్‌ ఫైల్‌ చేసి ఆయనను అరెస్టు చేసేవరకు ఊరుకోమని ఆయన స్పష్టం చేశారు.
ప్రజలతో ఎన్నుకున్న సర్పంచులను సస్పెండ్‌ చేసే అధికారం కలెక్టర్లకు కట్టబెట్టినప్పుడు హామీలు నెరవేర్చని సీఎంను సస్పెండ్‌ చేసే అధికారం సీఎస్‌కు కల్పిస్తూ ఉత్త ర్వులు జారీచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.