బిజెపి మాజీ ఎంపీకి ఎన్సీపీ నేతల బెదిరింపులు 

మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండేకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనకు ఎన్‌సీపీ నేతల నుంచి బెదరింపు కాల్స్ వస్తున్నాయని భారతీయ జనతా పార్టీ నేత, మాజీ ఎంపీ కీరిత్ సోమయ్య తెలిపారు. ధనంజయ్ ముండేకి వ్యతిరేకంగా మాట్లాడితే కాల్చిచంపుతామంటూ ఆరుగురు ఎన్‌సీపీ నేతలు తనను ఫోనులో బెదరించినట్టు ఆయన ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘ముండేకు వ్యతిరేకంగా మాట్లాడితే కాల్చేస్తామంటున్నారు. ఆరుగురు ఎన్‌సీపీలు నేతలు నన్ను బెదరిస్తున్నారు. అయితే ఇలాంటి బెదరింపులకు మేము భయపడం. ధనంజయ్ ముండే రాజీనామా చేయాల్సిందే’ అని ఆ ట్వీట్‌లో కీరిత్ సోమయ్య స్పష్టం చేశారు. 

దనంజయ్ ముండే తన ఎన్నికల అఫిడవిట్‌లో తన కుమారుడు, కుమార్తె పేర్లు ప్రస్తావించలేదంటూ ఎన్నికల కమిషన్‌కు సోమయ్య ఇటీవల లేఖ రాశారు.  మరోవంక, ధనంజయ్ ముండే 2006లో తనపై పదేపదే అత్యాచారం చేశాడని, తన ఫిర్యాదును ముంబై పోలీసులు పట్టించుకోలేదని వారం రోజుల క్రితం ధనంజయ్ ముండేపై ఒక మహిళ ఆరోపణలు చేసింది.

అయితే, ఈ ఆరోపణలను ముండే ఖండించారు. సదరు మహిళ, ఆమె సోదరి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు, బాధ్యతగల మంత్రిగా ముండే తన పదవి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.