మాజీ మంత్రి దేవినేని అరెస్ట్… గొల్లపూడిలో ఉద్రిక్తత 

మంత్రి కొడాలి నాని సవాల్‌కు ప్రతి సవాల్‌గా టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా దీక్షకు యత్నించగా దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకోవడంతో విజయవాడ  గొల్లపూడి సెంటర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు  అడ్డుకున్నారు. గోల్లపూడి సెంటర్‌లో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
 
కోవిడ్‌ నిబంధనల కారణంగా దీక్షకు అనుమతి లేదని ముందే చెప్పిన పోలీసులు.. ఆయన అక్కడకు రాగానే అరెస్టు చేశారు. పోలీసు వాహనాన్ని అడ్డుకునేందుకు టిడిపి కార్యకర్తలు ప్రయత్నించారు.   దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో గొల్లపూడిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  
 
గొల్లపూడికి ఎమ్మెల్యే వంశీ, వసంత కృష్ణప్రసాద్‌లు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ.. ” నిన్న కొడాలి నాని మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను తీసుకురండి. ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పిన వాగ్దానాలను నేను తీసుకొస్తాను. రెండింటి పై చర్చిద్దాం.. ఎవరు ఎన్నికలకు ముందు చెప్పిన వాగ్దానాలను అమలుచేశారు.. చేయలేదు.. చర్చిద్దాం.. మీ ఇంటికొస్తాను ” అని చెప్పారని తెలిపారు.
 
దీంతో ” ఉమ మాట్లాడుతూ.. నేను ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు వస్తాను.. నన్ను టచ్‌ చేసి చూడు ” అని అన్నారని చెప్పారు. ఏ టీవీ స్టూడియోకైనా రమ్మని కొడాలి నాని దేవినేని ఉమకు బహిరంగ సవాల్‌ విసిరారని, కానీ ఉమ ఏ స్టూడియోకు రాలేదని వంశీ అన్నారు.
 
సోమవారం గొల్లపూడిలో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ లో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాజీ మంత్రి దేవినేని తన చేతిలోనో, ఎమ్మెల్యేలు కృష్ణప్రసాద్‌, వల్లభనేని వంశీ చేతిలోనో దెబ్బలు తినక తప్పదని హెచ్చరించారు. “ఈ రోజు మైలవరం నియోజకవర్గం వచ్చి మాట్లాడుతున్నా. నేను ఎప్పుడైనా వస్తా. మీ చంద్రబాబు ఏం చేశారో ? మా జగన్‌ ఏం చేశారో చెబుతా. మీ ఇంట్లో అయినా సరే చర్చకు నేను సిద్ధం ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఇంటికొచ్చి బడితె పూజ చేస్తా.. లేకపోతే నా పేరు కొడాలి నాని కాదు.” అని సవాల్‌ విసిరారు.  
కాగా, ఇబ్రహీంపట్నం, ఈలప్రోలు వద్ద టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకుని వెళుతున్న వాహనాన్ని నందిగామా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కొద్ది సేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ‘దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం.. సీఎం జగన్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు.