రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసు కొట్టివేత 

రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసు కొట్టివేత 
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఏపీ రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ.. సీఐడీ పెట్టిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. కిలారు రాజేష్‌తో పాటు మరికొంత మంది..రాజధానిలో భూములు ముందుగానే కొనుగోలు చేశారని సీఐడీ కేసులు నమోదు చేసింది. రాజధానిలో ఉన్న ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేసింది.

భూములు అమ్మినవారు ఎవరూ ఫిర్యాదు చేయలేదని..ప్రభుత్వం కక్షసాధిస్తోందని పేర్కొంటూ కిలారు రాజేష్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. భూములు అమ్ముకున్నవారు ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం.. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ జరగలేదని పేర్కొంటూ.. దీనికి ఐపీసీ సెక్షన్లకు వర్తించవని హైకోర్టు స్పష్టం చేసింది.

అమరావతి భూముల విషయంలో ఏపీ హైకోర్టు తీర్పు అత్యంత కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. రాజధాని విషయంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుగానే నిర్ణయం తీసుకోవడంతో,  అమరావతిని రాజధానిగా ప్రకటించడానికి ముందే టిడిపి ప్రముఖులు పలువురు,  వారి సన్నిహితులు తమ కుటుంభం సభ్యుల పేర్లతో, బినామీల పేర్లతో పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసి భారీగా లాభం పొందారని నేటి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికల సమయంలో ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకున్నారు. 
 
అధికారంలోకి రాగానే మంత్రివర్గ  ఉపసంఘం ఏర్పాటు చేసి, ఆ విధంగా లబ్ధిపొందిన ప్రముఖుల జాబితాను తెయారు చేసి, సిఐడికి అందజేసి వారితో కేసు నమోదు చేయించారు. అయితే అసలు ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనేది ఐపీసీలో లేదని, అది స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన అంశమని,  చాలా మంది వాదిస్తున్నారు. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఎలా నేరమని ప్రశ్నలు వచ్చాయి. దీన్నే హైకోర్టు ధృవీకరించింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ కింద.. ఐపీసీ సెక్షన్ల కింద కేసులు పెట్టలేరని తేల్చేసింది.
 
రాజధాని అమరావతిలో చేపట్టిన అనేక నిర్మాణ కార్యకలాపాలను నిలుపుదల చేయించి, ప్రభుత్వం కార్యాలయాలు అన్నింటిని ఇక్కడి నుండి కార్యనిర్వాహక రాజధాని పేరుతో విశాఖపట్నంకు మార్చడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు.