ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ పొడిగింపు

నిఘా పరికరాల కొనుగోళ్ల అక్రమాల వ్యవహారంలో వేటుకు గురైన ఐపీఎస్‌ అధికారి ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలల పాటు సస్పెన్షన్‌ను పొడగిస్తున్నట్లు తెలిపింది. ఆగష్టు నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు దేశభద్రతకు ముప్పు వాటిల్లేలా డ్రోన్ల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్‌ చేసింది.
 ఈ క్రమంలో ఆయన హైకోర్టును ఆశ్రయించగా సస్పెన్షన్‌పై గతంలో స్టే ఇచ్చింది. అయితే డ్రోన్ల కొనుగోలు కుంభకోణంలో సస్పెన్షన్‌కు గురైన ఏబీని సస్పెండ్‌ చేయడానికి కచ్చితమైన ప్రాథమిక ఆధారాలున్నాయని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో(క్యాట్‌) ఇదివరకే స్పష్టం చేయడం సహా, ఏపీ ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్‌ ఉత్తర్వులను రద్దు చేయాలని ఏబీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
ఈ నేపథ్యంలో సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పును ఇవ్వగా  దానిని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసి, స్టే పొందగలిగింది. కాగా,   ఏపీ ప్రభుత్వం తనపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు కుట్ర పన్నుతోందని వెంకటేశ్వరరావు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు కే లేఖ రాశారు. త్వరలోనే క్రిమినల్ కేసుపెట్టి జ్యూడిషియల్ రిమాండ్‌కు పంపి, మళ్లీ సస్పెన్షన్ ఆర్డర్ విధించాలని కుట్ర పన్నుతోందం టూ ఆరోపించారు.
 
ఇందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఆ లేఖలో ఏబీ పేర్కొన్నారు. ఇప్పటికే నెలల తరబడి తనను ఉద్యోగం చేయనీయకుండా, జీతం ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని వెంకటేశ్వరరావు విమర్శించారు. వెంటనే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌ జనరల్ బాడీ ఏర్పాటు చేస్తే అన్ని విషయాలు ఆధారాలతో సహా వివరిస్తానని, నిష్పక్షపాత విచారణ జరగాలన్నది తన డిమాండ్ అని ఆ లేఖలో వివరించారు. అయితే అసోసియేషన్ ప్రభుత్వం సస్పెన్షన్ చేయడానికి తగు ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ, జోక్యం చేసుకోవడానికి తిరస్కరించింది.