శ్రీరామ జన్మభూమి భవ్యమందిర నిర్మాణంలో పాలుపంచుకుందాం

అయోధ్యలో నిర్మితమవుతోన్న భవ్య రామమందిర నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రజలు  భాగస్వాములవ్వాలని ఎస్సీ-ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ రాష్ట్ర గౌరవాధ్యక్షులు, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ శ్రీ పరశురామయ్య ఒక ప్రకటనలో కోరారు.

ఈ సందర్భంగా  డాక్టర్ శ్రీ పరశురామయ్య మాట్లాడుతూ.. శ్రీ రాముడు మంచి పరిపాలనను అందించిన గొప్ప చక్రవర్తి అని. మిత్రత్వం, సోదర భావం, సామాజిక సమతలకు ప్రతీక అని కొనియాడారు. చరిత్రలో మనల్ని పాలించిన అనేక మంది రాజులు, చక్రవర్తులు మనకు తెలుసు. వీటిలో శ్రీ రాముడు అందించిన పాలన అన్ని విధాలా ప్రజారంజకమైనది. మిత్రుడైన వనవాసీ గిరిజన రాజు గుహుని పట్ల మిత్రత్వం, నిమ్న కులానికి చెంది, ఉన్నత భక్తికి సంకేతమైన శబరిమాత పట్ల ఆత్మీయత, సీతమ్మ రక్షణలో అశువులు బాసిన జటాయువుకు స్వయంగా అంత్యక్రియలు చేయడం, సోదరుడు లక్ష్మణుడు ప్రమాదంలో ఉన్నపుడు శ్రీ రాముడు సొదరునికై విలపించిన తీరు, ధర్మరక్షణకై అన్ని విధాలా నిలబడ్డ హనుమంతుని పట్ల చూపిన ప్రేమ మొదలైనవి శ్రీ రాముని వ్యక్తిత్వాన్ని తెలియచేసే కొన్ని ఉదాహరణలు అని అన్నారు.
ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని వంటి అత్యుత్తమ సిద్ధాంతాలతో ధర్మానికి ప్రతీకగా నిలిచిన శ్రీ రాముని జన్మభూమి ఆయోధ్యలో ఆయన కొరకు నిర్మితమవుతున్న భవ్య మందిర నిర్మాణంలో  షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రజలు కూడా పాలుపంచుకోవాల్సిందిగా SC-ST హక్కుల సంక్షేమ వేదిక పిలుపునిస్తోందని డాక్టర్ పరశురామయ్య తెలిపారు.
Source: VSK Andhra