కర్నూలుకు హైకోర్టుపై అమిత్ షాకు జగన్ వినతి 

కర్నూలుకు హైకోర్టుపై అమిత్ షాకు జగన్ వినతి 

రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా కర్నూలులో హైకోర్టును నెలకొల్పేలా రీనోటిఫికేషన్‌ ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోరారు. మంగళవారం రాత్రికలిసి షాను కలసి గంటకు పైగా జరిపిన సమావేశంలో  ప్రధానంగా మూడు రాజధానుల అంశాన్ని సీఎం ప్రస్తావించారని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ అధికార ప్రకటనలో తెలిపింది.

 దాని ప్రకారం ప్రాంతాల వారీగా అభివృద్ధిలో సమతుల్యతను సాధించడంలో భాగంగా అధికార వికేంద్రీకరణకు రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందని, కార్యనిర్వాహక పరిపాలనా రాజధానిగా విశాఖను, శాసన రాజధానిగా అమరావతి, న్యాయరాజధానిగా కర్నూలును ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, . ఇందుకోసం వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి చట్టం-2020ని తీసుకొచ్చామని జగన్‌ కేంద్ర హోం మంత్రికి చెప్పారు. 

కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని బీజేపీ 2019 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచిన విషయాన్నీ గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అంచనా వ్యయాన్ని రూ.55,656.87 కోట్లకు ఆమోదించాల్సిందిగా కేంద్ర జలశక్తి శాఖకు సూచించాలని కోరారు. 2018 డిసెంబరు నుంచి ఇప్పటి వరకు రావాల్సిన రూ.1,644.23 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 

ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని కూడా షాకు జగన్‌ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి హోదా చాలా అవసరమని, కొత్త పరిశ్రమలు ఏర్పడి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. అలాగే, 2014-15 నాటికి గాను రెవెన్యూ లోటు రూ.22,948.76 కోట్లు అని, కేంద్రం మాత్రం రూ.4,117.89 కోట్లుగా గుర్తించిందని, అందులోనూ 3,979.5 కోట్లు మాత్రమే విడుదల చేసిందని వివరించారు. మిగిలిన మొత్తం రూ. 18,83087 కోట్లు విడుదల చేయాలని కోరారు. 

విజయనగరంలో గిరిజన వర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. దిశ బిల్లుకు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు బిల్లుకు ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని, ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టానికి రాష్ట్రపతి ఆమో దం పొందేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.  రాష్ట్రంలో డిస్కం సంస్థల ఆర్థిక పరిస్థితి బాగోలేదని, తగిన సాయం అందించాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు.  

ఆంధ్రప్రదేశ్‌ జీవరేఖ అయిన పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యేందుకు వీలుగా కేంద్రం సహకరించాలని కోరారు.  పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ (ఆర్‌సీసీ) సిఫారసు మేరకు రెండో సవరించిన అంచనా వ్యయానికి (ఆర్‌సీఈ) ఆమోదం తెలపాలని కోరారు.

కాగా, అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరుకావలసిందిగా ఈడీ కోర్టు జారీ చేసిన సమన్ల విషయాన్ని సీఎం జగన్‌ ప్రస్తావించినట్లు తెలుస్తున్నది. అరబిందో, హెటిరో సంస్థలకు భూకేటాయింపుల కేసు నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అవ డం, దానిని విచారణకు స్వీకరించి, కోర్టు ముందు హాజరుకావాలని సమన్లు జారీ చేసిన విషయాన్ని షాకి వివరించినట్లు తెలిసింది. 

ముందుగా సీబీఐ విచారణకు సంబంధించిన కేసులు పూర్తయ్యాకే  ఈడీ విచారణను ప్రారంభించాలన్న అభిప్రాయాన్నీ ఆయన ముందుంచినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో దేవాలయాల్లో దేవతా విగ్రహాల ధ్వంసం, ప్రభుత్వ చర్యలు ప్రస్తావనకు వచ్చాయని తెలుస్తోంది.