ట్రాక్ట‌ర్ల ర్యాలీపై ఢిల్లీ పోలీసులదే తుది నిర్ణ‌యం

వ్యవసాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ  ఈనెల 26వ తేదీన రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతులు ట్రాక్ట‌ర్ల‌తో ర్యాలీ నిర్వ‌హించ‌నున్న విష‌యం తెలిసిందే. గ‌ణ‌తంత్ర‌ దినోత్స‌వం రోజున జ‌రిగే ట్రాక్ట‌ర్ ర్యాలీని అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. 
 
 దీనిపై అత్యున్న‌త న్యాయ‌స్థానం స్పందిస్తూ ఆందోళ‌న చేస్తున్న రైతుల అంశం ఢిల్లీ పోలీసు శాఖ‌ ప‌రిధిలోకి వ‌స్తుంద‌ని, ఎందుకంటే అది శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య అని సుప్రీం పేర్కొన్న‌ది.  ఢిల్లీలోకి ప్ర‌వేశం అంశాన్ని స్థానిక పోలీసులే చూసుకోవాల‌ని, ఎవ‌రికి అనుమ‌తి ఇవ్వాలి, శాంతి భ‌ద్ర‌త‌ల స‌మస్య‌ను ఎలా చూడాలి, ఇలాంటి వాటిపై నిర్ణ‌యం తీసుకునేది తాము కాదు అని కోర్టు స్పష్టం చేసింది. 
 
ఈ కేసు విచార‌ణ‌ను బుధ‌వారానికి వాయిదా వేస్తున్న‌ట్లు సుప్రీం చెప్పింది.  ట్రాక్ట‌ర్ల ర్యాలీల‌తో రిపబ్లిక్ డే సంబ‌రాల‌ను అడ్డుకోవ‌డం  దేశానికి అవ‌మానంగా మిగులుతుంద‌ని ఢిల్లీ పోలీసులు త‌మ పిటీష‌న్‌లో సుప్రీంకు తెలిపారు. నిర‌స‌న చేసే హ‌క్కు ఉంది కాదా అని  దేశానికి చెడ్డ‌ పేరు తెచ్చే చ‌ర్య‌లు చేప‌ట్ట‌వ‌ద్దు అని కేంద్రం త‌న పిటిష‌న్‌లో తెలిపింది.  
 
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ. బోబ్డే, ఎల్‌. నాగేశ్వరరావు, వినీత్‌ శరణలతో కూడిన ధర్మాసనం విచారించింది. మరోవైపు రైతుల ఆందోళన వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మంగళవారం భేటీ కానుంది.  అయితే రాజ్‌ప‌థ్‌లో జ‌రిగే ప‌రేడ్‌కు మాత్రం అభ్యంత‌రం క‌లిగిచ‌బోము అని రైతు నేత‌లు పేర్కొన్నారు.  సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ సుమారు వెయ్యి ట్రాక్ట‌ర్ల‌తో ఆ రోజున రైతులు ఢిల్లీలో ర్యాలీ తీయాల‌ని భావిస్తున్నారు.