గురుమూర్తి ప్రకటనతో శశికళ ఎత్తుగడలపై దుమారం!

ఆదాయంకు మించి ఆస్తులున్న కేసులో నాలుగేళ్ల జైలుశిక్షను పూర్తి చేసుకొని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళ వచ్చే వారం బైటకు వస్తూ ఉండడంతో ఆ రాష్ట్ర రాజకీయాలలో కళకలం రేగుతున్నది. మరో నాలుగు నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా శశికళ వేయబోయే రాజకీయ ఎత్తుగడలు కీలకంగా మారనున్నాయి. 
 
ఈ సందర్భంగా తుగ్లక్ పత్రిక సంపాదకుడు ఎస్ గురుమూర్తి చేసిన వాఖ్యలు తమిళ్ రాజకీయాలలో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. డీఎంకే ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలి అంటే వచ్చే ఎన్నికలలో శశికళ, ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే కలసి పోటీ చేయాలని ఆయన స్పష్టం చేశారు. అంటే  పరోక్షంగా అన్నాడీఎంకే, శశికళ, బిజెపి తదితర పార్టీలు విస్తృత ఎన్డీయే కూటమిగా ఏర్పడాలని సూచిస్తున్నారు. 
 
దానితో శశికళ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తాను జైలుకు వెళ్ళిపోగానే తిరుగుబాటు బావుటా ఎగురవేసి, అధికారంలో సర్దుకు పోతున్న ప్రస్తుత అన్నాడీఎంకే నాయకత్వంతో ఆమె సంధి చేసుకుంటారా? శశికళను, ఆమె మేనల్లుడు టివి దినకరన్ ను దగ్గరకు తీసుకొని డీఎంకే వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా అన్నాడీఎంకే నాయకత్వం చూడగలుగుతుందా? వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 
 
శశికళ జైలులో ఉండడం, బిజెపి అండగా ఉండడంతో ఇబ్బందుల్లేకుండా పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న అన్నాడీఎంకే నాయకత్వానికి ప్రజాకర్షణ గల నేతలు లేవు. డీఎంకే వలే సంస్థాగత సామర్ధ్యం కూడా అంతకన్నా లేదు. మరోవంక అంతర్గతంగా కుమ్ములాటలు ఎట్లాగూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో శశికళ సొంతంగా ఎన్నికల రంగంలోకి దిగినా, మరికొన్ని చిన్న చిన్న పార్టీలతో చేతులు కలిపినా ఎన్నికలలో విజయం సాధింపలేక పోయినా అన్నాడీఎంకే తిరిగి అధికారంలోకి రావడం సాధ్యం కాదన్నది వేరే చెప్పనవసరం లేదు.  
 
అందుకనే బిజెపి సహితం వ్యూహాత్మకంగా పావులు కడుపుతున్నది. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కాపాడటంపై కన్నా డీఎంకే ను అధికారంలోకి రాకుండా కట్టడి చేయడంపై దృష్టి సారిస్తున్నది. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం లేదని స్పష్టం చేయడంతో ఒక విధంగా తమిళ రాజకీయాలలో నూతన నాయకత్వంకు అవకాశాలు సన్నగిల్లాయని చెప్పవచ్చు. 
 
అందుకనే తాము ఎన్డీయేలో భాగస్వామిగానే పోటీ చేస్తున్నామని అన్నాడీఎంకే నాయకత్వం ప్రకటనలు చేస్తున్నా ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో బిజెపి నోరు మెదపడం లేదు. ఈ విషయమై అన్నాడీఎంకే నేతలలో కొంత అసహనం వ్యక్తం అవుతున్నది. 
 
శశికళతో చేతులు కలిపితే ఆమె అవినీతి చరిత్ర కళంకం కలిగిస్తుందనే వాదనలను ప్రస్తావిస్తూ గతంలో మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి చెప్పిన సామెతను ప్రస్తావించారు. “మీ ఇల్లు తగలబడుతుంటే మంటలు ఆర్పడం కోసం గంగాజలం కోసం ఎదురు చూడం. దగ్గర్లో బురదనీళ్ళున్నా మంటలు ఆర్పడానికి ఉపయోగిస్తాం”. అదే విధంగా డీఎంకే గెలుపును అడ్డుకోవడానికి అన్ని రాజకీయ శక్తులు ఒకటి కావాలని గురుమూర్తి పిలుపిచ్చారు. 
 
పైగా గురుమూర్తి ఇటువంటి పిలుపు ఇవ్వడం ప్రాధాన్యత సంతరింప చేసుకొంది. ఎందుకంటె జయలలిత మరణం అనంతరం ఆమె అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టడం, ఆ తర్వాత దాదాపు ముఖ్యమంత్రి పదవి చేబట్టపోవడాన్ని గురుమూర్తి తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే సుప్రీం కోర్ట్ ఆమె శిక్షను అంతలో ఖరారు చేయడంతో ఆమె ముఖ్యమంత్రి కాలేకపోయారు. 
 
పైగా, తుగ్లక్ పత్రిక 51వ వార్షికోత్సవ సభలో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో ఆయన ఈ వాఖ్యలు చేయడం రాజకీయంగా వేడి రాజుకొనేటట్లు చేస్తున్నాయి. ఆ దిశలో బిజెపి నాయకత్వం తగు సన్నాహాలు చేస్తున్నట్లు సంకేతాలను ఆయన పంపినట్లు అయింది. 
 
గురుమూర్తి మాటలను గమనిస్తే ఇప్పుడు తమిళనాడులో రాజకీయ పరిస్థితులు డీఎంకే గెలుపుకు అనుకూలంగా ఉన్నట్లు స్ఫష్టం అవుతున్నది. డీఎంకే ప్రభుత్వం ఏర్పడితే అందులో భాగస్వామిగా కాంగ్రెస్ ఉండడం బిజెపికి వ్యూహాత్మకంగా ఇబ్బందికరమైన అంశం. పైగా కేరళలో ఎటు ప్రతికూల ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్నందున కనీసం తమిళనాడులో అనుకూల ప్రభుత్వం ఏర్పాటు అవసరం కాగలదు. 
 
దినకరన్ నాయకత్వంలోని ఎఎంఎంకె పార్టీ 2019 లోక్ సభ ఎన్నికలలో గణ, 19 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలలో గాని ఒక్క సీట్ కూడా గెలుచుకోలేక పోయినా 6 శాతం ఓట్లు పొందడం గమనార్హం. అన్నాడీఎంకేను ఓడించడానికి ఆ ఓట్లు సరిపోగలవు. అందుకనే దినకరన్, శశికళను అన్నాడీఎంకే శిబిరంలోకి తీసుకు రావడం ఇప్పుడు డీఎంకే ఓటమికి కీలకం కాగలదని బిజెపి గుర్తించినట్లు స్పష్టం అవుతున్నది.