భారత్ కరోనా ఎదుర్కొంటున్న తీరుకు ఐఎంఎఫ్ ప్రశంస 

కరోనా వైరస్ కట్టడితో పాటు దానివల్ల కుంటుపడిన ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడం కోసం భారత్ నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఫ్) ప్రశంసించింది.  అయితే ఆర్థికవ్యవస్థలో సానుకూల మార్పులకు దోహదం చేసే చర్యలను ఈ సంవత్సరం కూడా కొనసాగించాలని సూచించింది. 

అంతర్జాతీయ మీడియా రౌండ్‌టేబుల్ సమావేశం సందర్భంగా ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జీవా మాట్లాడుతూ కరోనా కాలంలో తీసుకున్న చర్యల ఫలితంగా ఈ సంవత్సరం భారత్‌లో ప్రతికూల ప్రభావం అంతగా ఉండకపోవచ్చని అభిప్రాయం బ్యాకతం చేశారు. 

ఆర్థిక వ్య‌వ‌స్థ దూకుడుగా మారేందుకు భార‌త ప్ర‌భుత్వం మ‌రింత చేయూత‌నివ్వాల‌ని ఆమె సూచించారు.  రాబోయే వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ అప్‌డేట్‌లో భార‌త్ ర్యాంకు మెరుగుప‌డ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు.  క‌రోనా సంక్షోభ వేళ భార‌త్ తీసుకున్న చ‌ర్య‌లు ఆ దేశానికి మేలు చేయ‌నున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు.
జ‌న‌రివ 26వ తేదీన వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ర్యాంక్‌లు విడుద‌ల‌వుతాయ‌ని, వాటిల్లో భార‌త్ స్థానం మెరుగ్గా ఉంటుంద‌ని, ఎందుకంటే ఆ దేశం మ‌హ‌మ్మారి వేళ తీసుకున్న చ‌ర్య‌లు అమోఘం అని ఆమె పేర్కొన్నారు. అంత భారీ జ‌నాభా ఉన్న దేశం అక‌స్మాత్తుగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌ అని ఆమె తెలిపారు.
టార్గెట్ ఆంక్ష‌లు, లాక్‌డౌన్‌తో భార‌త్‌లో వైర‌స్ నియంత్ర‌ణ క‌ట్టుదిట్టంగా సాగింద‌ని,  వృద్ధి రేఖ‌ల‌ను పోలిస్తే, కోవిడ్ క‌న్నా ముందు భార‌త్ ప్ర‌గ‌తి ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలాగే ఉంద‌ని ఐఎంఎఫ్ చీఫ్ తెలిపారు. ఆర్థిక‌, ద్ర‌వ్య‌ప‌ర‌ప‌తి విధానాల బ‌లోపేతం కోసం భార‌త ప్ర‌భుత్వం అద్భుత చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు క్రిస్ట‌లీనా కొనియాడారు.
 మార్కెట్లు అసాధార‌ణ రీతిలో కోలుకుంటున్నాయ‌ని, ప్ర‌భుత్వం ఒక‌వేళ మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకుంటే, భార‌త్ ఇంకా దూసుకు వెళ్తుంద‌ని ఆమె పేర్కొన్నారు.