మమతకు టిఎంసి ఎంపీ శతాబ్ది రాయ్ షాక్

టిఎంసి నుండి వచ్చే నెలల్లో 50 మంది ఎమ్యెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీకి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ షాక్ ఇచ్చిన మరుసటి రోజుననే ఆమె పార్టీకి చెందిన మరో ఎంపీ శతాబ్ది రాయ్ ఖంగు తినిపించారు. ఆమె శుక్రవారం ఇచ్చిన ట్వీట్ టిఎంసి వర్గాలలో కలకలం రేపుతున్నది.
“నేను ఏదైనా ఒక నిర్ణయం తీసుకొనే మీకు జనవరి 16 మధ్యాహ్నం 2 గంటలకు తెలుపుతాను” అంటూ ఆమె తాను టిఎంసిలో కొనసాగే అంశంపై సందిగ్థను వ్యక్తం చేశారు. ఈ రోజు ఢిల్లీకి వెడుతున్న ఆమె కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలుస్తారా అన్న ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పలేదు.
 
“నేను మూడు సార్లు ఎంపీగా గెలిచాను. నాకు ఇక్కడ ఇల్లు ఉంది. అనేకమంది వచ్చి కలుస్తుంటారు. నేను కూడా పలు సమావేశాలు, కార్యక్రమాల సందర్భంగా అనేకమందిని కలుస్తుంటాను. ఎవ్వరో ఒకరిని కలవడం అసాధారణం కాదు. అయితే ప్రత్యేకంగా ఒకరిని కలుస్తున్నట్లు చెప్పలేను” అంటూ పేర్కొన్నారు.
 
పార్టీ కార్యక్రమాలకు తాను తరచు దూరంగా ఉండటానికి కొందరు పార్టీ నేతలే కారణమని ఆమె ధ్వజమెత్తారు. తాను పార్టీలో ఉండాలని కొందరు సొంత పార్టీ నేతలే కోరుకోవడం లేదని ఆమె ఎదురు దాడికి దిగారు. ‘శతాబ్ది రాయ్ ఫ్యాన్ క్లబ్’ ఫేస్‌బుక్‌లో తన నియోజకవర్గమైన బీర్బూమ్‌లో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటానికి కారణం వివరించారు.
 
పార్టీ కార్యక్రమాల షెడ్యూల్స్‌ను మందస్తుగా తనకు తెలియజేయడం లేదని ఆమె ధ్వజమెత్తారు. బీర్బూమ్‌లో జరిగే పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు కనిపించడం లేదని కొందరు తనను అడుగుతున్నారని, తనకు షెడ్యూల్ తెలియనప్పుడు ఎలా వెళ్లగలనని ఆమె ప్రశ్నించారు.  తాను ఆయా కార్యక్రమాల్లో ఉండాలని కొందరు కోరుకోవడం లేదని ఫేస్‌బుక్ పోస్టులో ఆమె రాశారు. టీఎంసీ వర్గాల కథనం ప్రకారం, 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో చెదురమదురుగానే కనిపిస్తున్నారు.
 
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిసెంబర్ 28న బీర్బూమ్ వచ్చినప్పుడు మాత్రమే చివరిసారిగా శతాబ్ది రాయ్ కనిపించారు. ‘బీర్బూమ్ స్థానిక నేతలతో శతాబ్ది రాయ్‌కు అంతగా సత్సంబంధాలు లేవు. పార్టీ ఎంపిక చేసిన అభివృద్ధి ప్రాజెక్టులకు వెచ్చించకుండా తన ఎంపీలాడ్స్‌ను ఆమె తెప్పించుకుని పంపిణీ చేయడం స్థానిక నేతలకు నచ్చలేదు’ అంటూ మరోవంక పార్టీ నేతలు ఆమెపై మండిపడుతున్నారు.