రామమందిరంకు రాష్ట్రపతి రూ 5,01,000 విరాళం

అయోధ్య‌లో చేప‌ట్ట‌నున్న రామాల‌య నిర్మాణం కోసం విరాళాల‌ సేక‌ర‌ణ మొద‌లైంది.  రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ అయోధ్య ట్ర‌స్టుకు రూ 5,01,000 విరాళం ఇచ్చారు.  విరాళాల సేక‌ర‌ణ ప్ర‌క్రియ నేటి నుంచి దేశం మొత్తం నిర్వ‌హించ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 27వ తేదీ వ‌ర‌కు ఆల‌య నిర్మాణం కోసం విరాళాలు సేక‌రించ‌నున్నారు.

శ్రీ రామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు త‌ర‌పున స‌హ అధ్య‌క్షుడు గోవింద్ దేవ్ గిరిజీ మ‌హారాజ్‌  ఇవాళ రాష్ట్ర‌ప‌తి కోవింద్‌ను క‌లిశారు.  వీహెచ్‌పీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్‌,  ఆల‌య నిర్మాణ క‌మిటీ చీఫ్ నిపేంద్ర మిశ్రా, ఆర్ఎస్ఎస్ నేత ఖుల్‌భూష‌న్ అహుజా కూడా రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన వారిలో ఉన్నారు.

వీహెచ్‌పీ నేత అలోక్ కుమార్ మాట్లాడుతూ దేశ తొలి పౌరుడిగా ఆయన నుంచే విరాళాల సేకరణ ప్రారంభించాలని భావించామని చెప్పారు. విరాళాలు ఇచ్చిన వారందరికీ రశీదులు ఇవ్వనున్నారు. రూ.10 చందా కోసం నాలుగు కోట్ల రశీదులు, రూ.100 విరాళం కోసం 8 కోట్లు, రూ.వెయ్యి విరాళానికి 12లక్షల రశీదులను ట్రస్ట్‌ ముద్రించింది. నిధుల సేకరణలో విదేశీ నిధులకు ఆస్కారం లేకుండా చూడాలని ట్రస్ట్ సూచించింది. ప్రజలు ఆన్‌లైన్‌లోనూ విరాళాలు ఇవ్వొచ్చని కమిటీ తెలిపింది.

44 రోజుల పాటు విరాళాల సేకరణ నిరంతరాయంగా కొనసాగనుంది. ఎప్పటికప్పుడు సేకరించిన మొత్తాన్ని లెక్కించనున్నారు. బృందాలన్నీ ట్రస్ట్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా పని చేయనున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్, అనుబంధ సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు సైతం కీలకపాత్ర పోషించనున్నారు.