స‌హ‌నాన్ని ప‌రీక్షించే ప్ర‌య‌త్నం చేయ‌వ‌ద్దు

ఎవ‌రూ కూడా త‌మ స‌హ‌నాన్ని ప‌రీక్షించే ప్ర‌య‌త్నం చేయ‌వ‌ద్దు అంటూ భారత్ ఆర్మీ చీఫ్  జ‌న‌ర‌ల్ ఎంఎం నరవాణే పరోక్షంగా చైనా, పాకిస్థాన్ లను హెచ్చరించారు.ఢిల్లీలో జ‌రిగిన ఆర్మీ డే ప‌రేడ్ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ  స‌రిహ‌ద్దుల్లో చైనాతో ఉన్న ఉద్రిక్తత తెలిసిందే అని,  సరిహద్దును మార్చే కుట్ర జ‌రుగుతోంద‌ని తెలిపారు.
 
వారికి గ‌ట్టిగా బ‌దులు ఇచ్చామ‌ని, గాల్వ‌న్ దాడిలో అమ‌రులైన వీరుల త్యాగాలు వృధాపోనివ్వ‌మ‌ని ఆర్మీ చీఫ్ హామీ ఇచ్చారు.  గ‌త ఏడాది జూన్ 15వ తేదీన గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌తీయ సైనికులు మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత భార‌త్‌, చైనా మ‌ధ్య ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది.
 
ప‌లు ద‌ఫాలు రెండు దేశాల మ‌ధ్య సైనిక‌, దౌత్య చ‌ర్చ‌లు కూడా సాగాయి. కానీ ల‌డాఖ్ స‌రిహ‌ద్దుల్లో మాత్రం టెన్ష‌న్ త‌గ్గ‌లేదు. చ‌ర్చ‌ల ద్వారా, రాజ‌కీయంగా స‌రిహ‌ద్దు దేశాల‌తో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని మ‌రోసారి ఆర్మీ చీఫ్ న‌ర‌వాణే తెలిపారు.
పాకిస్థాన్‌కు కూడా గ‌ట్టి హెచ్చ‌రిక చేశారాయ‌న‌. గ‌త ఏడాది కాల్పుల విర‌మ‌ణ ఘ‌ట‌న‌లు 44 శాతం పెరిగాయ‌ని, అది పాకిస్థాన్ మోస‌పూరిత బుద్ధిని బ‌య‌ట‌పెడుతోంద‌ని  మండిపడ్డానారు.  భార‌త్‌లోకి చొర‌బ‌డేందుకు సుమారు 400 మంది ఉగ్ర‌వాదులు పాక్ స‌రిహ‌ద్దులు వేచి ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేయడానికి డ్రోన్లు, సొరంగాలను పాకిస్థాన్ ఉపయోగిస్తోందని పేర్కొన్నారు. గత ఏడాది జమ్మూ-కశ్మీరులో జరిగిన వేర్వేరు సంఘటనల్లో సుమారు 200 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపారు. 

భారత సైన్యాన్ని ఆధునికీకరించేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎమ‌ర్జెన్సీ-ఫాస్ట్‌ట్రాక్ ప‌ద్ధ‌తిలో ఆ ప‌నులు జ‌రుగుతున్న‌ట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు. గ‌త ఏడాది సుమారు రూ 5 వేల కోట్ల ఖ‌రీదైన ఆయుధాల‌ను ఆర్మీ ప్రొక్యూర్ చేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు.  సుమారు రూ 13 వేల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్న‌ట్లు కూడా ఆయ‌న వెల్లడించారు.