రెండేళ్లలో తెలంగాణ ఐటీ రంగంలో రెండు లక్షల ఉద్యోగులకు ముప్పు!

రెండేళ్లలో తెలంగాణ ఐటీ రంగంలో రెండు లక్షల ఉద్యోగులకు ముప్పు!

వచ్చే రెండేళ్లలో ఐటీరంగంలో తెలంగాణలో రెండు లక్షలకు పైగా ఉద్యోగులు తమ ఉపాధి కోల్పోతారని, ఉద్యోగుల స్థానాన్ని ఏఐ ఆక్రమిస్తుందని ఐటీనిపుణులతోపాటు ప్రభుత్వం అంచనా వేస్తోంది. సమర్ధంగా, నిర్వరామంగా పనిచేయగలిగే ఏఐ టెక్నాలజీని కంపెనీలు ఎక్కువగా వినియోగిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైంది. అంతకుముందు రెండేళ్లతో పోలిస్తే ఈసారి క్యాంప్‌సలలో కొత్త ఉద్యోగాల నియామకం మూడోవంతు కూడా లేదని ఐటీనిపుణులు అంటున్నారు.

2026 ప్రారంభం నుంచే ప్రముఖ సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తగ్గిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులను ఆకస్మిక షాక్‌లకు గురిచేస్తున్నాయి. టెక్‌ దిగ్గజం ఒరాకిల్‌ ఇటీవల 30 వేల ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భారత సంతతికి చెందిన వారే ఎక్కువగా ఉండడం మరింత కలవర పెట్టే అంశం. ఏఐ, ఆటోమేషన్‌ వంటి రంగాల్లో భారీ పెట్టుబడులకు నిధులను సర్దుబాటు చేసేందుకే ఈ కోతలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. 

ప్రపంచ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ జనవరి 2026లో దాదాపు 16,000 కార్పొరేట్‌ ఉద్యోగాలను తగ్గించినట్లు అధికారికంగా ధ్రువీకరించింది. 2025 చివర్లో తగ్గించిన 14,000 ఉద్యోగాలను కలుపుకుంటే మొత్తం ప్రభావిత ఉద్యోగుల సంఖ్య 30,000 దాటింది. సంస్థలో ఉన్న మేనేజ్‌మెంట్‌ స్థాయిలను తగ్గించి, బ్యూరోక్రసీని తగ్గించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతున్నారు. 

ఆర్థిక వనరులను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అభివృద్థి వైపు మళ్లిస్తూ గతంలో అధికంగా నియామకాలు జరిగిన విభాగాల్లో కోతలు విధిస్తోంది. అమెరికాలో ప్రభావిత ఉద్యోగులకు సాధారణంగా 90 రోజులు సమయం ఇస్తున్నారు, ఈ సమయంలో వారు సంస్థలోనే ఇతర అవకాశాలను వెతుక్కోవచ్చు.  మరొక ప్రముఖ టెక్నాలజీ సంస్థ డెల్‌ 2026 జనవరి 30 నాటికి సంబంధించిన ఫైలింగ్‌ ప్రకారం కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య సుమారు 11,000 తగ్గి 97,000కు చేరింది. 2024 ఆర్థిక సంవత్సరంలో డెల్‌ ఉద్యోగుల సంఖ్య: 1,20,000గా ఉంటే 2025 కల్లా 1,08,000 చేరింది. ఇప్పుడు లక్ష లోపే ఉంది.

క్లౌడ్‌, ఏఐ, ఆటోమేషన్‌ రంగాల్లో పెట్టుబడులు పెంచుతున్న సంస్థలు సంప్రదాయ విభాగాల్లో ఉద్యోగాలను తగ్గిస్తున్నాయి. దిగ్గజ కంపెనీల నిర్ణయంతో హైదరాబాద్‌లోని ఉద్యోగులూ భారీగానే తొలగింపునకు గురయ్యారు. ఏఐతో కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతోందని, ఉన్న ఉద్యోగాలకు ఇబ్బంది లేదని చెబుతూ వస్తుండగా, ఇప్పుడు ఉద్యోగుల కోత తీవ్రమైన అంశమని, దీనిపై దృష్టి సారించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవలే హార్వర్డ్‌ యునివర్సిటీతో వీడియో కాన్ఫరెన్స్‌ ప్రసంగంలో చెప్పారు. 

ఏఐ టెక్నాలజీతో ఉద్యోగులను తొలగిస్తే కంపెనీలు నష్టపరిహారం చెల్లించేలా కొత్త చట్టం తెచ్చే యోచనలో ఉన్నామని తెలిపారు. తొలగింపునకు గురైన ఉద్యోగుల నైపుణ్యాల పెంపునకు ప్రభుత్వ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చే ఆలోచన కూడా ఉందని తెలిపారు. ఇప్పుడు ఏఐ రాకతో స్టార్టప్‌ కంపెనీల్లోనూ ఉద్యోగుల కోత మొదలైంది. 

ఓ ఎడ్యుటెక్‌ కంపెనీ ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌ కేంద్రంగా దేశవ్యాప్తంగా సేవలు ప్రారంభించింది. ప్రారంభంలో టెక్నాలజీ కోసం కంపెనీ 18 నెలలపాటు శ్రమించింది. దీనికి రూ.1.3 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో 40 మంది ఉద్యోగులు పనిచేసేవారు. ఇప్పుడు ఇదే కంపెనీ రూ. 35 లక్షలు వినియోగించి ఏఐ టెక్నాలజీని వినియోగించి, 30 మంది ఉద్యోగులను తొలగించి కేవలం 10 మందితోనే గతంకంటే మెరుగైన సేవలు అందిస్తోంది. 

అలాగే గచ్చిబౌలి కేంద్రంగా ఉన్న ఓ కన్సల్టెన్సీ కంపెనీలో మూడేళ్ల నుంచి 400 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఏఐ ప్లాట్‌ఫాం వినియోగించి ఈ కంపెనీ 360 మంది ఉద్యోగులను తొలగించి కేవలం 40 మందితోనే పని కానిస్తుంది. ఏఐ టెక్నాలజీతో కంపెనీల ఉత్పాదకత, లాభాలు పెరుగుతున్నా ఉద్యోగాలు మాత్రం పడిపోతున్నాయి.