దేశ‌వ్యాప్త వ్యాక్సినేష‌న్ ప్రారంభించిన ప్రధాని మోదీ  

దేశ‌వ్యాప్త వ్యాక్సినేష‌న్ ప్రారంభించిన ప్రధాని మోదీ  

క‌రోనాను అంతం  చేసేందుకు దేశ‌వ్యాప్తంగా ఇవాళ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లైంది.  ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇవాళ వ‌ర్చువ‌ల్ విధానంలో వ్యాక్సినేష‌న్‌‌ను ప్రారంభిస్తూ ఇది దేశ చ‌రిత్ర‌లో మ‌రుపురాని రోజని చెప్పారు. ప్రపంచ‌వ్యాప్తంగా ప్రాణాంత‌కంగా మారిన క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం ప్ర‌భుత్వం వ్యాక్సినేష‌న్‌ను మొద‌లుపెట్టింది.

క‌రోనా వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుంద‌న్నభయం ఉండేదని, క‌రోనా టీకా వ‌చ్చేసింద‌ని మోదీ ప్రకటించారు.  ప్ర‌పంచం అంతా వ్యాక్సిన్ కోసం ఎదురుచూసింద‌ని గుర్తు చేశారు.  వ‌ర్చువ‌ల్ రీతిలో టీకా పంపిణీ ప్రారంభించిన త‌ర్వాత మోదీ మాట్లాడుతూ రాత్రి, ప‌గ‌లు లేకుండా శాస్త్ర‌వేత్త‌లు టీకా కోసం శ్ర‌మించారని అభినందించారు. చాలా త‌క్కువ స‌మ‌యంలో టీకా వ‌చ్చేసింద‌ని ప్రధాని సంతోషం వ్యక్తం చేశాన్నారు.  భారత్ లో తయారైన  టీకాలు రెండు వ‌చ్చాయని పేర్కొంటూ  ఇది భార‌త సామర్ధ్యం, వైజ్ఞానికి స‌త్తా అని వెల్లడించాయిన్నారు. భార‌తీయ ప్రతిభ అంటూ  ఎవ‌రికైతే అత్య‌వ‌స‌ర‌మో వారికి ముందుగా టీకా ఇస్తున్నామని ప్రకటించారు.

డాక్ట‌ర్లు, న‌ర్సులు, హాస్పిట‌ళ్ల‌లో చికిత్స పొందుతున్నారుని చెబుతూ వైద్య బృందాలు కూడా క‌రోనా టీకా తీసుకునేవారిలో ముందున్నార‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు. రెండు డోసులు వ్యాక్సిన్ త‌ప్ప‌నిస‌రి అని స్పష్టం చేశారు.  అన్ని రాష్ట్రాలు కూడా టీకా పంపిణీకి సన్న‌ద్దం అయి ఉన్నాయ‌ని తెలిపారు.

గ‌తంలో ఎన్న‌డూ ఇంత పెద్ద రీతిలో వ్యాక్సినేష‌న్ జ‌ర‌గ‌లేద‌ని చెబుతూ తొలి ద‌ఫాలో మూడు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు టీకా ఇస్తున్న‌ట్లు మోదీ తెలిపారు. సాధార‌ణంగా వ్యాక్సిన్ త‌యారీకి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంద‌ని, కానీ శ‌ర‌వేగంగా మ‌న శాస్త్రవేత్తలు టీకాను రూపొందించిన‌ట్లు చెప్పారు. కోవాగ్జిన్‌, కోవీషీల్డ్‌తో పాటు మ‌రికొన్ని టీకాల అభివృద్ధి జ‌రుగుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

కోవిడ్ టీకా తీసుకున్న త‌ర్వాత ముందు జాగ్ర‌త్త‌ల‌ను అస‌లు మ‌ర‌వ‌కూడ‌ద‌ని మోదీ హెచ్చరించారు. మాస్క్‌లు ధ‌రించ‌డం, సోష‌ల్ డిస్టాన్స్ పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి అని తెలిపారు. రెండు డోసుల వ్యాక్సిన్ తప్ప‌కుండా తీసుకోవాల‌ని ఆయ‌న దేశ ప్ర‌జ‌ల‌ను కోరారు.  రెండు డోసుల మ‌ధ్య నెల రోజుల తేడా ఉండాల‌ని నిపుణులు చెబుతున్న‌ట్లు ఆయ‌న గుర్తు చేశారు.

తొలి డోసు తీసుకున్న త‌ర్వాత ఎవ‌రూ నిర్ల‌క్ష్యంగా ఉండ‌రాద‌ని హెచ్చరించారు. ఎందుకంటే రెండ‌వ డోసు తీసుకున్న త‌ర్వాతే ఇమ్యూనిటీ పెరుగుతుంద‌ని చెప్పారు. సుర‌క్షితంగా తేలిన త‌ర్వాతే వ్యాక్సిన్ల‌కు పచ్చ‌జెండా ఊపిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

దేశం అంటే మ‌ట్టి కాదు, దేశం అంటే మ‌నుషులోయ్ అన్న గురుజాడ వ్యాఖ్య‌ల‌ను మోదీ త‌న ప్ర‌సంగంలో వినిపంచారు.  ప్ర‌జ‌లు ఒక‌రికి ఒక‌రు ఉప‌యోగ‌ప‌డాల‌న్న ఉద్దేశాన్ని ఆయ‌న వినిపించారు. కోవిడ్ అంతానికి ఇది ప్రారంభం అని మోదీ తెలిపారు. టీకాల‌ను అతి చౌక‌గా అందిస్తున్నామ‌ని పేర్కొన్నారు.  ఇత‌ర దేశాల‌తో పోలిస్తే త‌క్కువ ధ‌ర‌కే టీకాలు అందుబాటులో ఉన్న‌ట్లు మోదీ తెలిపారు.

మ‌న టీకాల‌ను అతిశీత‌ల వాతావ‌ర‌ణంలో స్టోర్ చేయాల్సి అవ‌స‌రం లేద‌ని చెప్పారు. గ‌తంలో ఎన్న‌డూ ఈ స్థాయిలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌లేద‌ని పేర్కొన్నారు.  సుమారు వంద దేశాలు, మూడు కోట్ల జ‌నాభా క‌న్నా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని, కానీ మ‌నం తొలి ద‌శ‌లోనే మూడు కోట్ల మందికి టీకా ఇస్తున్నామ‌ని గుర్తు చేశారు.  రెండ‌వ ద‌శ‌లో ఆ సంఖ్య 30 కోట్లు ఉండాల‌ని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

గ‌త ఏడాది ఏం జ‌రిగిందో ఒక‌సారి ప‌రిశీలిస్తే, దాని నుంచి ఎంతో నేర్చుకున్నామని ప్రధాని పేర్కొ‌న్నారు.  ఒక వ్య‌క్తిగా, ఒక కుటుంబంగా, ఓ దేశంగా ఎంతో నేర్చుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. క‌రోనా వైర‌స్ వ‌ల్ల‌ ప్ర‌జ‌లు త‌మ కుటుంబీకుల్ని క‌లుసుకోలేక‌పోయిన‌ట్లు ఆయ‌న గుర్తు చేశారు. చిన్నారుల కోసం త‌ల్లులు క‌న్నీరుపెట్టార‌ని, వాళ్లంతా ఇంటికే ప‌రిమితం అయ్యార‌ని చెప్పారు.

హాస్పిట‌ళ్ల‌లో చేరిన వృద్ధుల‌ను కుటుంబీకులు క‌లుసుకోలేక‌పోయార‌ని, క‌రోనా వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారికి స‌రైన రీతిలో అంతిమ సంస్కారాలు చేయ‌లేక‌పోయిన‌ట్లు మోదీ గుర్తు చేశారు.  దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు కోటి ద‌ట‌గా, ఇప్ప‌టి వ‌ర‌కు భారత్ లో ల‌క్ష‌న్న‌ర మంది మ‌ర‌ణించారు.