సుప్రీం కోర్టు స్టే విధించడం శుభపరిణామం  

కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు ఎందుకు చేస్తున్నారో రైతులకే తెలియదని బీజేపీ ఎంపీ హేమా మాలిని విచయం వ్యక్తం చేశారు. ఈ  చట్టాలపై సుప్రీం కోర్టు స్టే విధించడాన్ని ఆమె స్వాగతించారు. దీని వల్ల ఉద్రిక్తతలు కాస్త తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్‌‌లో రైతులు టవర్లను కూల్చడం సరికాదని హితవు చెప్పారు. 

‘వ్యవసాయ  చట్టాలపై సుప్రీం కోర్టు స్టే విధించడం శుభపరిణామం. ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితులు తగ్గడానికి దోహదపడొచ్చు. పలు దఫాల చర్చలు జరిగిన తర్వాత కూడా రైతులు ఓ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. అసలు తమకేం కావాలో అన్నదాతలకు స్పష్టత లేదు’ అని ఆమె తెలిపారు. 

కొత్త చట్టాలతో వచ్చే సమస్య ఏంటనేది కూడా వారికి స్పష్టత లేదని అంటూ ఎవరో చెప్పడం వల్లే రైతులు నిరసనలు చేస్తున్నారని ఆమె చెప్పారు.  ఈ ఆందోళనలతో పంజాబ్ తీవ్రంగా నష్టపోయిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 

పంజాబ్ లో  రైతులు టవర్లను కూల్చేవేయడాన్ని ప్రస్తావిస్తూ  అన్నదాతలు అలా చేయడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వం పలుమార్లు చర్చలకు పిలిచినప్పటికీ రైతులకు ఓ ఎజెండా అనేది లేకుండా పోయిందని ఆమె విచారం వ్యక్తం చేశారు. అందుకే చర్చలు విఫలమయ్యాయని హేమా మాలిని తెలిపారు.