టెక్నాల‌జీ స‌హిత సైన్యంకై ప్రణాళిక  

టెక్నాల‌జీ స‌హిత సైన్యాన్ని త‌యారు చేసేందుకు, భ‌విష్య‌త్తులో స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు కొత్త కార్యాచర‌ణ రూపొందించిన‌ట్లు భార‌త ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ మ‌నోజ్ ముకుంద్ న‌ర‌వాణె వెల్లడించారు. 
 
పాకిస్థాన్ ఇంకా ఉగ్ర‌వాదంపైనే ఆధార‌ప‌డి ఉంటోంద‌ని చెబుతూ ఉగ్ర‌వాదాన్ని తాము ఏమాత్రం స‌హించ‌బోమని స్పష్టం చేశారు. స‌రైన స‌మ‌యంలోనే సరైన రీతిలో ప్ర‌తిదాడి చేస్తామ‌ని హెచ్చరించారు. చైనా, పాక్ దేశాలు ఓ స‌మ‌స్య‌గా మారాయ‌ని, ఆ వాస్త‌వాన్ని కొట్టిపారేయ‌లేమని స్పష్టం చేశారు. 
 
 గ‌త ఏడాది ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొన్నామని పేర్కొంటూ   స‌రిహ‌ద్దుల్లో ప‌రిస్థితితో పాటు కోవిడ్‌19 లాంటి స‌మ‌స్య‌లు కీల‌కంగా మారాయ‌ని తెలిపారు. ఉత్త‌రం దిశ‌గా ఉన్న స‌రిహ‌ద్దుల్లో నిత్యం అప్ర‌మ‌త్తంగా ఉన్నామని చెప్పారు.  శాంతియుత ప‌రిష్కారం కోసం వేచి చూస్తున్న‌ట్లు చెబుతూ అయినా ఎటువంటి స‌మ‌స్య‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని భరోసా వ్యక్తం చేశారు. అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నామ‌ని ఆర్మీ చీఫ్ తెలిపారు.
 
ప్ర‌తి ఏడాది సాంప్ర‌దాయ శిక్ష‌ణా ప్రాంతాల‌కు పీఎల్ఏ ద‌ళాలు వ‌స్తుంటాయ‌ని,  శిక్ష‌ణ కాలం ముగిసిన త‌ర్వాత శీతాకాలంలో ఆ ప్రాంతాల‌ను ఖాళీ చేస్తార‌ని,  టిబెట్ పీఠ‌భూమిలో ఉన్న పీఎల్ఏ ద‌ళాలు వెనక్కి వెళ్ల‌డం మంచి ప‌రిణామ‌మే చెప్పారు. 
 
కానీ ఘ‌ర్ష‌ణాత్మ‌క ప్రాంతాల్లో.. చైనా వైపు కానీ, మ‌న వైపు కానీ ద‌ళాల సంఖ్య త‌గ్గ‌లేద‌ని తెలిపారు.   భార‌త్‌, చైనా మ‌ధ్య చ‌ర్చ‌లు స‌మ‌గౌర‌వంతో సాగాల‌న్న అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరుకుతుంద‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు.  
 
హై ఆల్టిట్యూడ్‌లో ఎక్కువ సంఖ్య‌లో ద‌ళాలు ఉన్నా.. చ‌లికాలంలో జ‌రిగే ప్ర‌మాదాల సంఖ్య మాత్రం త‌గ్గ‌లేద‌ని విచారం వ్యక్తం చేశారు. గ‌త ఏడాది కోల్డ్ ఇంజ్యూరీలు 0.13 శాతం కాగా, ఈ ఏడాది 0.15 శాతం న‌మోదు అయ్యాయి. 
 
సరిహ‌ద్దుల్లో అప్ర‌మ‌త్తంగా ఉన్నామ‌ని, ఎల్ఏసీకి చెందిన‌ సెంట్ర‌ల్‌, ఈస్ట్ర‌న్ సెక్టార్ల‌లో ఘ‌ర్ష‌ణాత్మ‌క ప్రాంతాలు ఉన్నాయ‌ని వివరించారు. అక్క‌డే చైనా త‌న మౌళిక వ‌స‌తుల‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు. వారి క‌దలిక‌ల‌పై నిత్యం నిఘా పెడుతున్నామ‌ని, దాని ఆధారంగానే త‌మ వ్యూహాల‌ను మార్చుకుంటున్న‌ట్లు న‌ర‌వాణే తెలిపారు.