వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి పెద్ద శత్రువుగా మారాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించిన సెకండ్ నేషనల్ యూత్ పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగిస్తూ యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
కొత్త తరం (యువత) రాజకీయాలలోకి రానంత వరకు వారసత్వ నేతలు రాజకీయాలను భ్రష్టు పట్టించడాన్ని ఆపబోరని ప్రధాని హెచ్చరించారు. ఇంటి పేర్లు చెప్పి ఎన్నికల్లో గెలవడాన్ని చూస్తున్నామని ఎద్దేవా చేశారు. కొందరు తమ కుటుంబీకులను కాపాడుకోవడానికి, వాళ్లకు లబ్ధి చేకూర్చడానికే రాజకీయాలు చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు.
వారసత్వ రాజకీయాల కారణంగానే దేశంలో చట్టం పట్ల గౌరవం గాని, భయం గాని ఉండడం లేదని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వ రాజకీయాలు దేశం ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం కన్నా కేవలం “నేను, నా కుటుంభం” అనే తత్వాన్ని దేశంలో నింపివేస్తున్నాయని ధ్వజమెత్తారు. దేశంలో రాజకీయ, సామజిక అవినీతికి ఇదే పెద్ద కారణమని విమర్శించారు. తమ ముందు తరాల వారు వారసత్వ రాజకీయాలలో అవినీతికి పాల్పడి చట్టం నుండి తప్పించుకొంటూ ఉండడంతో ఇప్పటి తరానికి సహితం అదే మార్గంగా కనిపిస్తోందని మండిపడ్డారు.
‘వారసత్వ రాజకీయాల్లో దేశానికి ప్రాముఖ్యం తక్కువగా ఇస్తారు. ఎంతసేపూ తాము, తమ కుటుంబీకుల గురించే ఆలోచిస్తారు. ప్రజలు ఇప్పుడు నిజాయితీతో కూడిన రాజకీయాలను ఆదరిస్తున్నారు. కానీ వారసత్వ రాజకీయ మహమ్మారి ఇంకా మనల్ని వీడిపోలేదు’ అంటూ వివరించారు.
దేశ రాజకీయాల్లో కొత్త రక్తం రావాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ యువత రాజకీయాలలోకి రావాలని స్పష్టం చేశారు. సానుకూల మార్పులు తీసుకురావడానికి ఇదే సరైన తరుణం అని పేర్కొన్నారు.
కాగా, భారత రాజ్యంగ రూపకల్పనకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్-2021 జరుగుతుండటం చాలా సంతోషంగా ఉన్నదని ప్రధాని తెలిపారు. తాము ఇటీవల తీసుకొచ్చిన నూతన జాతీయ విధానం-2020 జాతి అభివృద్ధి దిశగా పడిన కీలక ముందడుగు అని ప్రధాని పేర్కొన్నారు. తాము దేశ యువతకు మంచి అవకాశాలను కల్పించే వ్యవస్థను దేశంలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
More Stories
సచివాలయంపై నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్
తిరుమల లడ్డూ వివాదంలో ప్రత్యేక సిట్ దర్యాప్తు
జాతీయ స్థాయిలో తాజా పౌరుల రిజిస్టర్ అవసరం