రైతులు రాజకీయ కీలుబొమ్మలా మారవద్దు 

రైతులు రాజకీయ నేతల కీలుబొమ్మల్లా మారవద్దని, సమస్యలను పరిష్కరించుకోవడానికి సుప్రీంకోర్టు కమిటీ వద్దకు రావాలని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాశ్ చౌదరి హితవు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను కొంత కాలం అమలు చేసి, పరిశీలించాలని సూచించారు. 
 
ఆ తర్వాత అవసరమైతే సవరణలు చేయవచ్చునని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీని విశ్వసించాలని  రైతులను కోరారు.   అలా కాని పక్షంలో వీరి ఉద్యమం రాజకీయ ప్రేరేపితమని ప్రజలు భావిస్తారని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మంగళవారం ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని రైతులు చేస్తున్న ఆరోపణలపై కైలాశ్ స్పందిస్తూ, రైతులు సుప్రీంకోర్టును కాకుండా ఎవరిని నమ్ముతారని ప్రశ్నించారు.

‘‘వారు ప్రభుత్వాన్ని విశ్వసించరు, సుప్రీంకోర్టును సైతం నమ్మరా? వారు విశ్వసించాలి. చర్చలకు రావాలని చేతులు జోడించి విన్నవించుకుంటున్నాను’’ అంటూ అభ్యర్ధించారు. స్వామినాథన్  కమిటీ సిఫారసులు అమలు జరగకూడదని వారు కోరుకుంటున్నారా? ఎక్కడైనా అమ్ముకునేందుకు స్వేచ్ఛ కల్పించడం సరికాదని భావిస్తున్నారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. 

పాత విధానాలు అంత మంచివైతే రైతులు ఇప్పటికీ ఎందుకు పేదరికంలో మగ్గిపోతున్నారు? ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ఆత్మవలోకనం చేసుకోవాలని చౌదరి కోరారు.  

ఈ చట్టాలపై  కమిటీని ఏర్పాటు చేయడానికి సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని కైలాశ్ స్వాగతించారు. ఈ కమిటీ రైతుల నుంచి సలహాలు స్వీకరించి, ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కఠినంగా  వ్యవహరించడం వల్ల ప్రయోజనం ఉండదని రైతులకు తెలిపారు. ఈ చట్టాలు సంస్కరణాత్మకమైనవని, వీటికి కోట్లాది మంది రైతులు మద్దతిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.