వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్ట్ స్టే  

నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు స్టే కొనసాగుతుందని ధర్మాసనం పేర్కొంది. చర్చలు జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. జితేంద ర్ సింగ్ మాన్ (బీకేయూ అధ్యక్షుడు), డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషి (ఇంటర్నేషనల్ పాలసీ హెడ్), అశోక్ గులాటి (అగ్నికల్చరల్ ఎకనామిస్ట్), అనిల్ ధన్వంత్ (శివ్‌కేరి సంఘటన, మహారాష్ట్ర) కమిటీ సభ్యులుగా ఉంటారని కోర్టు పేర్కొంది. 
 
కేంద్రం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం మధ్యాహ్నం విచారణ జరిపింది. తమకున్న హక్కులకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ బోబ్డే సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. చట్టాన్ని సస్పెండ్ చేసి కమిటీ వేయడం తమకున్న అధికారాల్లో ఒకటని సీజేఐ పేర్కొన్నారు.  
 
అన్ని రైతు సంఘాల నుంచి క‌మిటీ అభిప్రాయాల‌ను సేక‌రించాల‌ని చీఫ్ జ‌స్టిస్ బోబ్డే తెలిపారు. న్యాయ ప్ర‌క్రియ ప‌ట్ల రైతు సంఘాలు విశ్వ‌స‌నీయత‌ చూపాల‌న్నారు.  రైతులు స‌హ‌క‌రించాల‌ని, ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డ‌మే త‌మ ఉద్దేశం అని సీజే పేర్కొన్నా.  ఒక‌వేళ స‌మ‌స్య ప‌రిష్కారం కావాల‌నుకుంటే, అప్పుడు కోర్టు జోక్యం అవ‌స‌ర‌మ‌ని లేదంటే మీరు ఆందోళ‌న కొన‌సాగించ‌వ‌చ్చు అని సీజే సూచించారు. 
 
వ్యవసాయ చట్టాల చట్టబద్ధత, నిరసనల కారణంగా ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణ వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని తమకున్న అధికారాల పరిధిలో సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ‘మనం ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటే ఒక స్పష్టత వస్తుంది’ అని చెప్పారు. రైతులు కమిటీ వద్దకు వెళ్లరన్న దానిపై వాదనలు తాము వినదలచుకోలేదని, మీరు (రైతులు) నిరవధిక ఆందోళనలు చేయదలచుకుంటే చేసుకోవచ్చని అన్నారు.
వ్య‌వ‌సాయ చ‌ట్టాల అంశంపై విచార‌ణ జ‌రిగిన స‌మ‌యంలో పిటీషన‌ర్ల త‌ర‌పున ఎంఎల్ శ‌ర్మ మాట్లాడుతూ  ప్ర‌ధాని మాత్రమే నిర్ణ‌యం తీసుకోగ‌ల‌ర‌ని పేర్కొంటూ ఆయనను ఒకసారి రైతులతో కలిసేటట్లు చేయమని కోరారు. అయితే ఈ విష‌యంలో తాము ప్ర‌ధానికి ఎటువంటి దిశానిర్దేశం చేయ‌లేమ‌ని సీజే స్పష్టం చేశారు.
‘ప్రధానిని చర్చలకు వెళ్లమని మేము చెప్పలేం. ఈ కేసులో ఆయన పార్టీ కాదు’ అని తెలిపారు. తమకున్న అధికారులతో సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయగలమని, జ్యుడిషియల్ ప్రక్రియలో భాగమే కమిటీ అని, చిత్తశుద్ధితో పరిష్కారం కోరుకునే రైతులు కమిటీ ముందుకు వెళ్లవచ్చని సీజేఐ పేర్కొన్నారు.  
రైతు సంఘాల‌తో ఇద్ద‌రు కేంద్ర మంత్రులు చ‌ర్చించిన‌ట్లు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ హారీశ్ సాల్వే తెలిపారు. ప్ర‌స్తుతానికి వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను స‌స్పెండ్ చేస్తున్నామ‌ని, కానీ శాశ్వ‌తంగా ఆ చ‌ట్టాల‌ను స‌స్పెండ్ చేయ‌లేమ‌ని సీజే వివరణ ఇచ్చారు.