రూ 200 కే అందుబాటులోకి కరోనా వ్యాక్సిన్ 

కరోనా వ్యాక్సిన్ కేవలం రూ 200 కే ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన చర్య తీసుకొంది. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకాకు చెందిన కోవిషీల్డ్ టీకా డోసులను  అందుబాటులో ధరలో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం డీల్‌కు సిద్ధపడుతోంది. ఇందుకోసం కోవీషీల్డ్‌ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి  చేస్తున్న పుణేకు చెందిన అతిపెద్ద టీకా తయారీదారు సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాతో  ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ ఒప్పందంతో

ప్రారంభ  దశలో  మొదటి 100 మిలియన్  (కోటి ) మోతాదులను  రూ 200 కే అందించనున్నామని సీరం వర్గాలు వెల్లడించాయి. ప్రతి వారం కొన్ని మిలియన్‌ డోసుల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లు సరఫరా చేస్తామని, తొలుత 11 మిలియన్‌ డోసులను అందిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. మంగళవారం ఉదయం కల్లా ఈ టీకాల రవాణా  మొదలవుతుందని  కూడా ప్రకటించారు.

కోవిషీల్డ్‌తో పాటు భారత్‌ బయోటెక్‌  రూపొందిస్తున్న కోవాగ్జిన్‌ టీకాల అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఇటీవల అనుమతులు మంజూరు చేసింది.  జనవరి 16 నుంచి టీకా పంపిణీ చేపట్టనున్నట్లు గతవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తొలి ప్రాధాన్యం కింద 3 కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా అందించనున్నారు. 

ఆ తర్వాత 50ఏళ్లు పైబడిన వారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే 50ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. జులై నాటికి 30కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, దేశ ప్ర‌జ‌ల‌కు ఇవ్వ‌బోయే రెండు టీకాల‌ను  పీఎం కేర్స్ నిధుల‌తో ఖ‌రీదు చేయ‌నున్న‌ట్లు ప్ర‌ధాని నరేంద్ర మోదీ తెలపడం గమనార్హం.

ఇలా ఉండగా, పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌ నుంచి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తరలింపు మంగళవారం వేకువ జామున ప్రారంభమైంది. మొదటి డోసుతో మూడు ట్రక్కులు పుణెలోని విమానాశ్రయానికి బయలుదేరాయి. అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించనున్నారు. వ్యాక్సిన్‌ తరలింపునకు ముందు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పుణె జోన్‌-5 డీసీపీ నమ్రతా పాటిల్‌ మాట్లాడుతూ టీకా మొదటి డోసును సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా నుంచి తరలించేందుకు విస్తృతమైన భ్రదతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. విమానాశ్రయం నుంచి ఢిల్లీ, అహ్మదాబాద్‌, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కర్నాల్‌, హైదరాబాద్‌, విజయవాడ, గౌహతి, లక్నో, చండీగఢ్‌, భువనేశ్వర్‌కు తరలించనున్నారు. ట్రక్కుల్లో 478 బాక్సులను తీసుకెళ్లగా.. ప్రతి పెట్టె బరువు 32 కిలోలు ఉంటుంది.