ఈ నెల 16 నుండి ప్రారంభం కానున్న కరోనా వ్యాక్సిన్ కార్యక్రమంలో తొలిదశలో మూడు కోట్లమంది ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు వేస్తామని, అందుకయ్యే ఖర్చులను పూర్తిగా కేంద్రమే భరిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ ఖర్చుతో సంబంధం లేదని స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ కార్యక్రమం గురించి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయిన ప్రధాని కోవిడ్ సంక్షోభం వేళ అందరం కలిసికట్టుగా పనిచేయడం సంతోషంగా ఉందని తెలిపారు.
చాలా సున్నితమైన అంశంలో అందరూ త్వరగా నిర్ణయాలు తీసుకున్నట్లు చెబుతూ అందు వల్లననే ఇతర దేశాల్లో వ్యాప్తి చెందినట్లుగా భారత్‌లో కోవిడ్ వ్యాప్తి చెందలేదని పేర్కొన్నారు. ప్రైవేటు అయినా ప్రభుత్వం అయినా.. తొలి దశలో ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్లకు టీకాలు ఇవ్వనున్నట్లు ప్రధాని వెల్లడించారు.
చాలా సరసమైన ధరల్లో రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని ప్రధాని భరోసా ఇచ్చారు. ఒకవేళ విదేశీ టీకాలపై ఆధారపడి ఉంటే, దేశంలో పరిస్థితి మరోలా ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వసనీయ పద్ధతిలోనే కోవిడ్ టీకాలకు ఆమోదం ఇచ్చినట్లు ప్రధాని స్పష్టం చేశారు.
భారత్‌లో రెండు టీకాలకు ఆమోదం దక్కిందని, అయితే ఆ టీకాలకు విశ్వసనీయ పద్ధతిలోనే ఆమోదం దక్కినట్లు ప్రధాని స్పష్టం చేశారు. ఆ రెండు టీకాలు శాస్త్రీయ సూత్రాలకు తగినట్లుగా ఉన్నాయని, ఇది గర్వకారణమైన విషయమని ఆయన తెలిపారు. ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన కోవీషీల్డ్, భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ టీకాలను కేంద్రం ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే యూనివర్సల్ ప్రోటోకాల్స్ ప్రకారమే శాస్త్రవేత్తల వర్గం ఆ రెండు టీకాలకు పచ్చజెండా ఊపినట్లు ప్రధాని తెలిపారు.
షరుతుల అంశంలో సంతృప్తి వ్యక్తం అయిన తర్వాతనే ఆ టీకాలకు ఈయూఏ ఆమోదం దక్కిందని పేర్కొన్నారు. ఒకవేళ రాష్ట్రాలే టీకాలను కొనుగోలు చేస్తే, అప్పుడు ధరల విషయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు ప్రధాని చెప్పారు. ఒకే ఒక్క ఏజెన్సీ బాధ్యత తీసుకుంటే ఉత్తమంగా ఉంటుందని, కేంద్ర ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంటే మంచిదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మరోసారి భేటీ నిర్వహించనున్నట్లు ప్రధాని తెలిపారు.
వ్యాక్సినేషన్ అంశంలో రియల్ టైమ్ డేటా చాలా కీలకమైందని ప్రధాని చెబుతూ టీకా తీసుకున్న వారందరికీ డిజిటల్ సర్టిఫికేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. డేటాను పొందుపరచడం వల్ల రెండవ డోసు విషయంలో అప్రమత్తం చేస్తుందని పేర్కొన్నారు. రెండవ దశలో 50 ఏళ్లు దాటిన వారికి, వ్యాధులు ఉన్న 50 ఏళ్ల లోపు వారికి టీకాలు ఇవ్వనున్నారు. రానున్న కొన్ని నెలల్లో సుమారు 30 కోట్ల మందికి టీకాలను ఇచ్చేందుకు ప్రణాళిక చేసినట్లు మోదీ తెలిపారు.
More Stories
మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
భార్యతో సెల్ఫీతోనే మావోయిస్టు చలపతి హతం!
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు