ఎన్నికల షెడ్యూల్‌ను కొట్టేసిన హైకోర్టు   

రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను  ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ షెడ్యూల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయంపై ఎస్‌ఈసీ‌ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది.

హైకోర్టు తాజా నిర్ణయంతో ఇప్పట్లో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్టేనని స్పష్టమైంది. వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ అడ్డొస్తుందని హైకోర్టు భావించింది. ఏపీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ ఏకపక్షంగా ప్రకటించారని పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రక్రియకు షెడ్యూల్ అవరోధం అవుతుందని, ప్రజారోగ్యమే ముఖ్యమని స్పష్టం చేసింది.

ప్రజారోగ్యం ఇబ్బందుల్లో పడుతుందని, అందువల్లే ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది.  రెండు గంటలపాటు హైకోర్టులో ఏజీ ప్రభుత్వ వాదనలు వినిపించారు. ఏకకాలంలో ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ కష్టమని ప్రభుత్వం వాదించింది.

ప్రజారోగ్యం దృష్ట్యా షెడ్యూల్‌ రద్దు చేస్తున్నామని, ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు కాపాడాల్సిందే.. ప్రజలకున్న హక్కులను కాలరాయలేమని ప్రకటించింది. ప్రభుత్వ వాదనలతో పూర్తిగా ఏకీభవిస్తూ.. ప్రభుత్వం సూచనలను ఎస్‌ఈసీ పట్టించుకోలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.  

ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్‌ఈసీ నిర్ణయం సహేతుకంగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నెల 8న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా హైకోర్టు తాజా తీర్పుపై డివిజన్‌ బెంచ్‌కు వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.