అయోధ్యలో మందిరం జాతీయ స్వాభిమాన సంకేతం 

అయోధ్యలో  నిర్మాణమవుతున్నది కేవలం రామమందిరమే కాదని, అది రాష్ట్ర మందిరం, జాతీయ స్వాభిమాన సంకేతం అని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి తెలిపారు.  ప్రపంచ సాంస్కృతిక రాజధానిగా అయోధ్యలో శ్రీరామమందిరం నిర్మాణం అవుతున్నట్లు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

ఇది శతాబ్దాల పాటు శ్రీ రామభక్తులు సాగించిన సంఘర్షణల అనంతరం గత ఏడాది సెప్టెంబర్ 9న దేశ అత్యున్నత న్యాయస్థానం రామమందిర నిర్మాణంకు సానుకూలంగా తీర్పు ఇవ్వడం, వెంటనే కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్ ను ఏర్పాటు చేయడం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ, శిలాపూజ నిర్వహించడంను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ఆలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలుపుతూ ప్రధాన ఆలయం 2.77 ఎకరాలలో, మూడు అంతస్థులలో జరుగుతోందని చెప్పారు. నిర్మాణంలో సిమెంట్, ఉక్కులను ఎక్కడ ఉపయోగించడం లేదని, కేవలం రాతితో మాత్రమే జరుగుతున్నదని స్పష్టం చేశారు. ఆలయ పునాదులు కూడా రాళ్లతోనే వేయడం జరుగుతోందని చెప్పారు.

మూడున్నరేళ్లల్లో ఆలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని, 2024లో భక్తుల దర్శనంకు వీలు కల్పించే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ ధర్మకార్యం కోసం లక్షలాది మంది రామభక్తులు బలిదానమయ్యారని తెలుపుతూ వారందరి త్యాగాలను స్మరిస్తూ మనమంతా పెద్ద ఎత్తున ఆర్ధిక సహాయం అందిద్దామని స్వామి గోవింద్ దేవ్ గిరి పిలుపిచ్చారు.

సాధారణ భక్తులు సౌకర్యార్ధం ట్రస్ట్ విరాళాలతో పాటు రూ 10, రూ 100, రూ 1000 కూపన్లు ముద్రించిన్నట్లు తెలిపారు. ఈ నిధి సమర్పణ కోసం  దేశంలోని అన్ని ప్రాంతాలు, కులాలు, తెగలు, మతాలు, భాషలకు చెందినవారిని చేరుకొనే ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.

అరుణాచల్ ప్రదేశ్, నాగభూమి, అండమాన్ నికోబర్ నుండి గుజరాత్ లోని కచ్ వరకు; కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పర్వతాలు, హిమాలయాలలో నివసిస్తున్న వారితో సహా అన్ని ప్రాంతాల ప్రజలను చేరుకొని వారంతా భవ్యమైన శ్రీ రామమందిర నిర్మాణంలో భాగస్వాములయ్యేటట్లు చేస్తామని చెప్పారు. నిధి సమర్పణ అభియాన్ తెలంగాణ అధ్యక్షులు వీసంశెట్టి విద్యాసాగర్, రాష్ట్ర కన్వీనర్ బండారి రమేష్ కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.