ఈ సారి కాగిత రహిత బడ్జెట్

దేశ స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా ఈ సారి కాగిత రహిత వార్షిక బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.  భారత దేశ చరిత్రలో బడ్జెట్‌ పత్రాలు ముద్రితం కాకపోవటం ఇదే తొలిసారి కాగలదు. 
 
కరోనా నేపథ్యంలో సాంప్రదాయబద్ధంగా వస్తున్న బడ్జెట్‌ పత్రులకు స్వస్తి చెప్పనున్నారు. బడ్జెట్‌ ప్రతులను ముద్రించేందుకు కార్మికులు చాలా మంది 15 రోజుల పాటు ప్రెస్‌లో ఉండాల్సి వస్తుందని, బడ్జెట్‌ సమర్పించేంత వరకు 100 మందికి పైగా ప్రజలు నార్త్‌బ్లాక్‌ బేస్‌మెంట్‌లో ఉండాల్సిన నేపథ్యంలో ఈ ఏడాది బడ్జెట్‌ పత్రుల ముద్రణను ఆపివేశారు. 
 
ముద్రణకు ముందు జరిగే సాంప్రదాయబద్ధంగా జరిగే హల్వా పంపక కార్యక్రమం కూడా ఉండదు. సాధారణంగా ఈ కార్యక్రమం జనవరి 20న నిర్వహిస్తారు. బడ్జెట్‌ తయారీ, ముద్రణ ప్రారంభ సమయంలో అనేక మంది పాల్గంటారు. పత్రులను తీసుకెళ్లేందుకు ట్రక్‌లు ఉంటాయి. అయితే ఈ సారి వీటన్నింటిని స్వస్థి పలుకుతున్నారు.
 
ఇక బడ్జెట్‌ ఫైల్‌ను కూడా ఆమె తీసుకురావాల్సిన అవసరం లేదు.ఈ ఏడాది బడ్జెట్‌ కాపీలను డిజిటల్‌ రూపంలో అందిస్తామని ఇప్పటికే ప్రకటించారు.  ఈ సారి పార్లమెంట్‌లోని 750 మంది సభ్యులకు బడ్జెట్‌, ఎకానమిక్‌ సర్వే డిజిటల్‌ కాపీలను అందించనున్నారు. 
 
కరోనా మూలంగా 2020-2021 ఏడాదిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వాటిలో కాగితాలు లేకుండా‌ బడ్జెట్‌ సమావేశాలు జరపడం ఒకటి. రికార్డులను డిజిటలైజ్‌ చేయాలని పార్లమెంట్‌ చాలా కాలంగా  ప్రయత్నిస్తోంది. ఇప్పుడు కరోనా కారణంగా అది ఆచరణ సాధ్యం కానున్నది. బడ్జెట్‌తో పాటు మిగతా ప్రతులను కూడా డిజిటలైజ్‌ చేస్తే బాగుంటుందని అధికారలు భావిస్తున్నారు. 
 
బడ్జెట్ సమావేశాలు జనవరి 29 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండు విడతల్లో జరగనున్నాయి. మొదటి విడతలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు… రెండో విడతలో మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. జనవరి 29న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు.