ప్రముఖ జర్నలిస్టు తుర్లపాటి కన్నుమూత

ప్రముఖ జర్నలిస్ట్ పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు (89) కన్నుమూశారు. గత రాత్రి కుటుంబరావు గుండెపోటుకు గురికావడంతో వెంటనే విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. 

 కుటుంబరావు 1933 ఆగస్టు 10 న విజయవాడలో సుందర రామానుజరావు, శేషమాంబ దంపతులకు జన్మించారు. తన 14 వ ఏట 1946 లో పాత్రికేయ వృత్తిలోకి అడుగుపెట్టి తనదైన ముద్రవేశారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం వద్ద కార్యదర్శిగా పనిచేశారు. 

ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు నుంచి మొదలుకొని నారా చంద్రబాబు నాయుడు వరకు 18 మంది ముఖ్యమంత్రులతో తుర్లపాటి పనిచేశారు. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు.

  తుర్లపాటి కుటుంబరావుకు పాత్రికేయ వృత్తిలో సుదీర్ఘ అనుభవం ఉంది. జర్నలిస్టుగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సభ అధ్యక్షుడిగా, అనువాద ప్రసంగికునిగా తుర్లపాటి కుటుంబరావు పేరుగాంచారు. ఆయన రాసిన ’18 మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు’ అనే పుస్తకంలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు.  

 1951లో ఆచార్య ఎన్‌జీ రంగా వాహిని పత్రికలో ఉప సంపాదకుడిగా, టంగుటూరి ప్రకాశం ప్రజాపత్రికలో సహాయ సంపాదకుడి గా, చలసాని రామారారు ‘ప్రతిభ’ పత్రికకు ఎడిటర్‌గా కుటుంబరావు విధులను నిర్వర్తించారు.  ఆంధ్రజ్యోతి దినపత్రికకు ఎడిటోరియల్ ఎడిటర్‌గా తుర్లపాటి పనిచేశారు.  విదేశాల్లో 20,000లకు పైగా సభల్లో ఉపన్యాసాలు చేసిన తుర్లపాట గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు.

కుటుంబరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ పరిషత్తు ఛైర్మన్‌గా పనిచేశారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు కుటుంబారావును కళాప్రపూర్ణతో గౌరవించింది. 1969లో నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ కమిటీలో సభ్యునిగా కేంద్రం ప్రభుత్వం తుర్లపాటిని నియమించింది. నేషనల్‌ ఫిల్మ్‌ అడ్వైజరీ కమిటీలో, సెంట్రల్‌ ఫిల్మ్‌ సెన్సార్‌ బోర్డులో సభ్యుడిగా నియమితులయ్యారు. సుమారు మూడు దశాబ్దాల పాటు ఏపీ ఫిల్మ్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించారు.  

ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో కుటుంబరావును తనతో పాటే ఉండాలని కోరినప్పుడు.. దాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారు. ప్రభుత్వంలో ఉండి నిజాలను కప్పిపెడుతూ రాయలేనని, జర్నలిస్టుగానే ఉంటానని కుటుంబరావు పేర్కొన్నారు. దీంతో ఆయనకు పాత్రికేయ వృత్తిపై ఎంత నిబద్ధత ఉందో అర్థమవుతోంది.