కుమ్ముక్కై ధరలు పెంచిన సిమెంట్, ఉక్కు పరిశ్రమలు 

సిమెంటు, ఉక్కు రంగాల్లోని భారీ పరిశ్రమలు కలిసికట్టుగా కూడబలుక్కుని ధరలను పెంచుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆరోపించారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఓ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయవలసి ఉందని స్పష్టం చేశారు. 

స్టీల్, సిమెంట్ ధరలు పెరుగుతూ పోతే, మన దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు అభివృద్ధి చేయడం కష్టమవుతుందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడేందుకు రానున్న ఐదేళ్ళలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో రూ.111 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. 

బిల్డర్స్ అసోసియేషన్ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. స్టీల్, సిమెంట్ విషయంలో నిజంగా ఇది మనందరికీ సమస్యగా మారిందని గడ్కరీ పేర్కొన్నారు. ఈ రంగాల్లోని పెద్దలు ఈ కుమ్మక్కు చర్యలకు పాల్పడుతున్నారని తాను భావిస్తున్నానని ధ్వజమెత్తారు.

తాను ఈ విషయాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చర్చించానని, ప్రధాన మంత్రి కార్యాలయంలోని ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా సుదీర్ఘంగా చర్చించానని తెలిపారు. ఉక్కు పరిశ్రమలోని కంపెనీలన్నిటికీ తమ సొంత ముడి ఇనుము గనులు ఉన్నాయని, లేబర్, పవర్ రేట్లు పెరుగుతాయనే ఇబ్బందులేవీ వాటికి లేవని, అలాంటి పరిస్థితుల్లో ఈ కంపెనీలు స్టీల్ రేట్లను ఏ విదంగా పెంచుతున్నాయో అర్థం కావడం లేదని కేంద్ర మంత్రి విస్మయం వ్యక్తం చేశారు.

దీనికి ఓ పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. స్టీల్, సిమెంట్ పరిశ్రమలకు ఓ రెగ్యులేటర్‌ను నియమించాలని బిల్డర్స్ అసోసియేషన్ సిఫారసు చేసిందని పేర్కొంటూ  ఇది మంచి సలహాయేనని, తాను దీనిని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.